- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
- భువనగిరి పట్టణంలో లక్ష డప్పుల సన్నాహక సమావేశం
యాదాద్రి భువనగిరి జనవరి 31 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఈనెల 7న నిర్వహించనున్న లక్షల డప్పుల గుండెచప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వింటే మంచిది.. లేనట్లయితే వారి భవిష్యత్‌ను వారే తేల్చుకోవాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. రేవంత్ సర్కార్‌ను హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన డప్పుల సన్నాహక సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
వర్గీకరణను ముందుగా తామే అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎవరి మాటలకు తల ఒగ్గి అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మాదిగల ఆశలపై నీళ్లు చల్లుతూ వర్గీకరణ చేపట్టకుండానే నూతన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లు అనంత రాములు, జీ వెంకటస్వామి కుటుంబాలే వర్గీకరణను అడ్డుకుంటున్నాయని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ కేవలం మాలవర్గాల నాయకులని పెంచి పోషిస్తూ మాదిగ వర్గాల నాయకులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో వెంకటస్వామి కుటుంబం ఏకకాలంలో మూడు పదవులు తెచ్చుకొని ఆ పార్టీని శాసించే స్థాయిలో ఉందని.. ఎస్సీ వర్గీకరణ చేస్తే మీ ముఖ్యమంత్రి పదవి తీసేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మాల నాయకులు రేవంత్‌రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మందకృష్ణ సంచలనమైన ఆరోపణలు చేశారు.
‘లక్షల డప్పులు గొంతులు’ కార్యక్రమానికి లక్షలాదిగా తరలిరావాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సహాయ కార్యదర్శి ఇటికల దేవేందర్ మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు నల్లచంద్రస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ సీనియర్ నాయకులు సందెల శ్రీనివాస్ మాదిగ, మంద శంకర్ మాదిగ, మీసాల గణేశ్ మాదిగ, దానయ్య మాదిగ, బోయలింగ స్వామి మాదిగ, జెరిపోతుల కరుణాకర్ మాదిగ, కొల్లూరి హరీష్ మాదిగ, కోళ్ల జహంగీర్ మాదిగ, నాగారం అంజయ్య మాదిగ, బండారు రవివర్ధన్ మాదిగ, బట్టు రామచంద్రయ్య మాదిగ, బర్రె జహంగీర్ మాదిగ, వేముల అశోక్ మాదిగ, కనుకుంట్ల జయ, రేణుక, మధు, సుభాష్, శివలింగం తదితరులు పాల్గొన్నారు.