calender_icon.png 29 September, 2024 | 1:04 PM

హైడ్రా కూల్చివేతల్లో హిందువులపై కక్ష

29-09-2024 02:34:03 AM

ముస్లింల బిల్డింగ్‌ను ఒక్కటైనా కూల్చలేదు

సర్కారుకు దమ్ముంటే ఎఫ్‌టీఎల్‌లోని ఓవైసీ కాలేజీలను కూల్చాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 28: హైడ్రా కూల్చివేతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై కక్షగట్టిందని, ఇప్పటివరకు ముస్లింలకు సంబంధించి ఒక్క నిర్మాణం కూల్చలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ఓవైసీ సోదరులు చెరువుల్లో కట్టిన కాలేజీలను వెంటనే కూల్చివేయాలని సవాల్ విసిరారు.

శనివారం ఆయన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరస్వతి శిశుమందిర్‌లో గోకరి అర్జున్ గౌడ్ తండ్రి జ్ఞాపకార్థం రూ.కోటిన్నరతో నిర్మించిన 10 అదనపు గదులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైడ్రాతో కాంగ్రెస్ తలగోక్కుంటుందన్నారు. మూసీ, హైడ్రా కూల్చివేతలు, ఆరు గ్యారంటీలు, మాజీ సర్పంచ్‌లకు నిధులు ఇవ్వకపోవడం తదితర అంశాలు కాంగ్రెస్ సర్కారు కొంపముంచబోతున్నాయని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ మెడలు వంచేందుకు తాము క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామన్నారు. తిరుపతి లడ్డూల విషయమై బండి సంజయ్ మాట్లాడారు. మాజీ సీఎం జగన్ తీరు చూస్తుంటే లడ్డూలను కల్తీ చేశారనే అనిపిస్తోందన్నారు. గతంలో రాష్ట్రపతి హోదాలో వచ్చిన కలాం డిక్లరేషన్ ఇచ్చారని గుర్తుచేశారు.

మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కారు హిందువుల ఇళ్లను కూల్చేందుకు సిద్ధమైందని ధ్వజమెత్తారు. మలక్‌పేట్ రేస్ కోర్సు నుంచి మూసారాంబాగ్ వరకు ఓవైసీ అనుచరులు కబ్జాలు చేశారని వాటిని తాకే దుమ్ము కాంగ్రెస్ సర్కారుకు ఉందా..? అని సవాల్ విసిరారు. మూసీ, హైడ్రా, గత సర్పంచులకు నిధుల మంజూరు, ఆరు గ్యారంటీల అమలు అంశాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

హైడ్రా చేస్తున్న దుశ్చర్యతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి ఎంతోమంది రోడ్డున పడ్డారని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయినా సీఎం రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఏళ్ల తరబడి రూపాయి రూపాయి దాచుకొని బ్యాంకు లోన్లు తీసుకొని ఇళ్లు కట్టుకుంటే హైడ్రా పేరుతో కూల్చివేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

సీఎంకు ధైర్యం ఉంటే ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ఓవైసీ కాలేజీలను కూల్చాలని సవాల్ విసిరారు. ఓల్డ్‌సిటీ ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉందని, న్యూ సిటీ కాలేదన్నారు. కానీ లంగర్‌హౌస్, న్యూ మారుతీనగర్, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చేందుకు సర్కార్ సిద్ధమైందన్నారు. కార్యక్రమంలో శిశుమందిర్ విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్‌రెడ్డి, పాఠశాల అధ్యక్షుడు గోకరి అర్జున్ గౌడ్, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.