calender_icon.png 20 October, 2024 | 6:33 PM

కింకర్తవ్యం?

20-10-2024 02:26:51 AM

  1. గ్రూప్-1 నిర్వహణపై మంత్రుల భేటీ
  2. నేడు కీలక ప్రకటన

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో పలువురు మంత్రులు శని వారం రాత్రి సమావేశమయ్యారు. పరీక్ష నిర్వహణ, జీవో 29 రద్దు, అభ్యర్థులు చేస్తున్న పలు విజ్ఞప్తులపై సుదీ ర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.

ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, ఉన్నతాధికారులతోపాటు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ సైతం పాల్గొన్నారు. కొన్ని రోజులుగా జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రుల సమావేశానికి ప్రాధాన్యత సంచరించుకుంది.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలా? లేకుంటే జీవో 29ను రద్దు చేయాలా? అనే అంశాలపై మంత్రులు చర్చించినట్లు సమాచారం. ముందుగా మెయిన్స్ పరీక్షను వాయిదావేసి ఆ తర్వాత జీవో 29 రద్దు విషయంలో ఆదివారం ఓ నిర్ణయం ప్రకటించే అవకాశం కనబడుతోంది.

జీవో 29ను రద్దుచేయడంతోపాటు గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షను సైతం రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించే అంశాలు మంత్రుల చర్చలో వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు గ్రూప్స్ పరీక్షల నిర్వహణ పార్టీకి నష్టం చేకూరేలా నిర్ణయం ఉండకూడదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సూచించినట్లు సమాచారం.

ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతోనూ మంత్రులు ఈ సమావేశంలో లోతుగా చర్చించినట్లు తెలిసింది. న్యాయపరమైన చిక్కులు ఏమైనా తలెత్తుతాయా? అనే అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా అభ్యర్థుల డిమాండ్లపై నేడు ఓ కీలక ప్రకటనను ప్రభుత్వం చేసే అవకాశముంది.

ఇదిలా ఉంటే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 21 నుంచి 27 వరకు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు ఇప్పటికే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈక్రమంలో మంత్రులు సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.