calender_icon.png 30 September, 2024 | 3:49 AM

పండ్ల వ్యాపారి ముసుగులో డ్రగ్స్ దందా

30-09-2024 01:57:15 AM

మూడోకంటికి తెలియకుండా అయిదేండ్ల విక్రయం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ఐదేండ్లుగా మూడోకంటికి తెలియకుండా డ్రగ్స్ దందా నడుపుతున్న ఓ వ్యక్తిని సిమ్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాపిల్ పండ్ల వ్యాపారి ముసుగులో అంతరాష్ట్ర డ్రగ్స్ రాకెట్‌ను నడుపుతున్న శశి నేగి అలియాస్ షామీ మహాత్మాను అరెస్ట్ చేశారు. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం..

యాపిల్ పండ్ల వ్యాపారం చేస్తున్న శశి నేగి ఎగువ సిమ్లా ప్రాంతంలో అయిదారేండ్లుగా పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా వాట్సాప్‌లోనే డ్రగ్స్ ఆర్డర్లు తీసుకొనేవాడు. నేరుగా కొనుగోలుదారుకి అప్పజెప్పేవాడు కాదు. కనీసం నలుగురైదుగురు చేతులు మారిన తర్వాత కస్టమర్‌కు డ్రగ్స్ చేరేవి.

ఈ డ్రగ్స్ ముఠా నిర్వహిస్తున్న వారిలో ఒకరితో ఇంకొకరు కాంటాక్ట్‌లో ఉండేవారు కాదు. కస్టమర్ నుంచి ఆర్డర్ తీసుకున్నాక నిర్మానుష్య ప్రదేశంలో ఆ డ్రగ్స్‌ను ఉంచి వీడియో తీసేవారు. దాన్ని కొనుగోలుదారికి నిందితుడు పంపేవాడు. అలా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తు లకు, కొనుగోలుదారులకు సంబంధం లేకుండా దందా నడిపేవాడు. దీంతో చాలా ఏండ్లుగా దొరకకుండా తప్పించుకున్నాడు. ఇప్పటివరకు మత్తుపదార్థాలు కొనుగోలు చేసిన ఏ వ్యక్తితోనూ నేగి నేరుగా కలవలేదు.