calender_icon.png 6 November, 2024 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్‌కు బానిసైన ఎన్‌ఐటీ విద్యార్థి

30-06-2024 01:28:47 AM

ఒక పెడ్లర్‌తో సహా కస్టమర్ల అరెస్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (విజయక్రాంతి): మాదాపూర్ హైటెక్స్ ప్రాంతంలో మాదాపూర్ పోలీసులు, నార్కోటిక్ పోలీసులు శనివారం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఒక డ్రగ్ పెడ్లర్‌తో సహా ముగ్గురు కస్టమర్లను పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన మోతికార్ సచితానంద్ అలియాస్ సచిన్ (28) అనే వ్యక్తి డ్రగ్ పెడ్లర్ కాగా, మిగతా ముగ్గురు కురుంతోట్ నవీన్ నాయక్ (27), ప్రణీత్ రెడ్డి(25), రాహుల్ రాజ్(27) కస్టమర్లని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయిచైతన్య, మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ మీడియా సమావేశంలో తెలిపారు. వారి నుంచి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరో నిందితుడు రాజు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని కూడా పట్టుకుంటామని పేర్కొన్నారు. పట్టుబడిన నిందితుల్లో ఒకడైన నవీన్‌పై గతంలో దుండిగల్ పీఎస్‌తో పాటు కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నాయన్నారు. నిందితులపై మాదాపూర్ పీఎస్‌లో కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 

డ్రగ్స్‌కు బానిసైన ఎన్‌ఐటీ విద్యార్థి..

బోయిన్‌పల్లికి చెందిన నవీన్ చదువులో చురుకుగా రాణించేవాడని పోలీసుల విచారణలో తేలింది. నవీన్ తమిళనాడులోని తిరుచ్చి ఎన్‌ఐటీలో బీటెక్ చేశాడు. ఈ క్రమంలో అక్కడ చెడు వ్యసనాలకు బానిసైన కొందరు స్నేహితులతో ప్రోద్బలంతో గంజాయి వాడడం ప్రారంభించిన నవీన్‌కు అది కాస్తా వ్యసనంగా మారింది. ఈ క్రమంలో చదువు మధ్యలోనే మానేసి బెంగళూరుకు మకాం మార్చి అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్‌గా జాబ్‌లో చేరాడు. పని నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సి రావడంతో అక్కడ డ్రగ్ పెడ్లర్లతో పరిచయం ఏర్పడింది. దీంతో నవీన్ డ్రగ్ పెడ్లర్‌గా మారి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డ్రగ్స్, గంజాయి విక్రయించడం ప్రారంభించడంతో పాటు తాను వాడేవాడు.