ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
సంగారెడ్డి, ఆగస్టు 26: ఐఐటీహెచ్ విద్యార్థులు తయారు చేసిన డ్రైవర్ లెస్ కారు అద్భుతంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అభినందించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థులు తయారు చేసిన డ్రైవర్ లెస్ వాహనాన్ని పరిశీలించి, అందులో ప్రయణం చేశారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ఐఐటీ విద్యార్థులు డ్రైవర్ లెస్ వాహనాన్ని తయారు చేయడం గర్వకారణమన్నారు. వాహనం ప్రయోగ దశలో ఉన్నదని, ఈ టెక్నాలజీ త్వరలోనే ఆచరణలోకి రావాలని కాంక్షించారు. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవలను త్వరలో అన్ని రంగాల్లో ఉపయోగిస్తామన్నా రు. ఐఐటీ విద్యార్థులు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంతో పోటీ పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు.