న్యూఢిల్లీ, డిసెంబర్ 24: కన్జూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీ శామ్‌సంగ్ ఇండియా తిరిగి రెసిడెన్షియల్ ఎయిర్ కండీషనర్ల మార్కెట్లో వాటాను పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఈ ఏడాది వేసవిలో అనూహ్యమైన వృద్ధి సాధించిన ఈ రంగంలో వచ్చే కొద్ది వారాల్లో డజను ఇన్వర్టర్ ఏసీ మోడల్స్‌ను విడుదల చేస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దశాబ్దకాలం క్రితం శామ్‌సంగ్ ఇండియా రూమ్ ఎయిర్ కండీషనర్ (ఆర్‌ఏసీ) మార్కెట్లో రెండవ పెద్ద కంపెనీగా ఉంటూ 2014 15 శాతం మార్కెట్ వాటాను సాధించింది.
అయితే క్రమేపీ ఈ విభాగంలో అమ్మకాలు తగ్గడం తో కంపెనీ తన వనరుల్ని అధిక వృద్ధి విభాగాలైన మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎల్‌ఈడీ డిస్‌ప్లేలు తదితరాల వైపు మళ్లించింది. దేశంలో అప్లెయెన్సెస్ మార్కెట్లో ప్రీమియం ఉత్పత్తులపై వినియోగదారులు మొగ్గుచూపుతున్నందున, తిరిగి 2025లో ఆర్‌ఏసీ విభాగంలో జోరు చూపించాలని శామ్‌సంగ్ నిర్ణయించిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
2024లో శామ్‌సంగ్ కేవలం ఐదు లక్ష ల యూనిట్లను మాత్రమే విక్రయించగలిగిం ది. మార్కెట్ వాటా ఏక సంఖ్యకే పరిమితమయ్యింది. కొత్త మోడల్స్‌ను విడుదల చేయ డం ద్వారా 2025లో ఆర్‌ఏసీ మార్కెట్లో వాటాను రెండంకెలకు పెంచుకోవాలని శామ్‌సంగ్ యోచిస్తున్నట్లు ఆ వర్గాలు వివరించాయి. దేశంలో ఆర్‌ఏసీలకు 1.1 కోట్ల యూనిట్ల మార్కెట్ ఉండగా, టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్, ఎల్‌జీ, డైకిన్, బ్లూస్టార్, హిటాచి జాన్సన్, పానాసోనిక్, లాయడ్ తదితర కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.