calender_icon.png 30 November, 2024 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్వత్రిక ఎన్నికలకు భిన్నమైన తీర్పు

29-11-2024 12:00:00 AM

లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నిక లలో మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికలలో ఎన్‌డీఏ కూటమిని, జార్ఖండ్, జమ్మూ, కశ్మీర్ ఎన్నికలలో ఇండియా కూటమిని గెలిపించి ప్రజలు భిన్నమైన తీర్పును ఇచ్చారు. మహారాష్ట్రలాంటి పెద్ద రాష్ట్రంలో, హర్యానాలాంటి రాజకీయ ప్రాబల్యం గల రాష్ట్రాలలో గెలుపుతో ఎన్‌డీఏ కూటమి ఇండియా కూటమిపై పైచే యి సాధించిందనే చెప్పాలి. లోక్‌సభ ఎన్నికలలో  భారతీయ జనతా పార్టీకి కొంత ప్రతికూల ఫలితాలు ఎదురైనా ఆ తర్వాత జరిగిన నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కీలక రాష్ట్రాలైన మహారాష్ట్ర, హర్యా నాలలో  పట్టు నిలుపుకొని రాజకీయంగా తన బలాన్ని మరోసారి నిరూపించుకుంది.

మహారాష్ట్ర, హర్యానాలలో ఎన్‌డీఏ హ్యాట్రిక్ విజయం సాధించటం మామూ లు విషయం కాదు. శనివారం నాడు ఫలితాలు వెలువడిన మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో మహారాష్ట్రలో మహాయుతి కూటమి, జార్ఖండ్‌లో ఇండి యా కూటమి  విజయం సాధించినా లోక్ సభ ఎన్నికల ఫలితాలకు భిన్నమైన ఫలితాలు వెలువడటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తు న్నాయి. జార్ఖండ్‌లో లోక్ సభ ఎన్నికలలో ఆధిక్యత సాధించిన ఎన్‌డీఏ శాసనసభ ఎన్నికలలో పరాజయాన్ని ఎదుర్కొంటే, మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికలలో 48 లోక్ సభ స్థానాలకు 30 స్థానాలలో జయ కేతనం ఎగరేసిన మహావికాస్ అఘాడికి శాసనసభ ఎన్నికలలో దారుణ ఓటమి ఎదురైంది. కూటమిలో ఏ ఒక్క పార్టీ కూడా ప్రతిపక్ష హోదా పొందలేని  పరాజయాన్ని మూటగట్టుకుంది.

‘మహా’ విజయం

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మహాయుతి కూటమి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. 288 శాసనసభ స్థానాలలో 233 స్థానాలలో మహాయుతి కూటమి విజయం సాధించటాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. కూటమిలో మూడు పార్టీలూ అంచనాలకు మించి విజయం సాధించాయి.  భారతీయ జనతా పార్టీ తాను 2014లో గెలిచిన 122 శాసనసభ స్థానాలు అధిగమించి 132 అసెంబ్లీ  స్థానాలలో గెలవటం మహారాష్ట్ర చరిత్రలో ఒక రికార్డ్.

అలాగే 2019లో శివసేన 56 శాసనసభ స్థానాలలో విజయం సాధిస్తే, శివసేనలో చీలిక వర్గమైన ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గం 57 శాసనసభ స్థానాలలో విజయం సాధించటం, అజిత్ పవార్ ఎన్‌సీపీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తాను పోటీ చేసిన 52 స్థానాలలో 41 చోట్ల జయకేతనం ఎగరవేయడంతో మహాయుతి కూటమి గతంలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ సాధించిన ఈ విజయంతో పార్టీలను చీల్చి ద్రోహం చేశారనే ముద్ర నుండి ఇద్దరు నాయకులు బయటపడ్డారనే చెప్పా లి.

మహారాష్ట్రలో ఆరు రీజియన్‌లలో మరాఠ్వాడా, విదర్భ, కొంకణ్, ఉత్తర మహారాష్ట్ర లో మహాయుతి 158 శాసనసభ స్థానాలను గెలుచు కొని ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలబడిందనే చెప్పాలి. ఈ నాలు గు ప్రాంతాలలో మహావికాస్ అఘాడి సింగిల్ డిజిట్ స్థానాలకు మాత్రమే పరిమితమై ఘోర పరాజ యాన్ని చవిచూసింది. 

మహాయుతి కూటమి విజయంలో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు కీలకపాత్ర పోషిస్తే, ‘లడకీ బెహన్ యోజన’ లాంటి పథకాలు, ఓబీసీలు, ‘ఏక్ హైతో సురక్ష హై’ లాంటి ప్రధానమంత్రి మోడీ ప్రచారం  ప్రధాన పాత్ర పోషించా యి. ఆరు నెలల క్రితం జరిగినలోక్‌సభ ఎన్నికలలో పరాజయం పాలైన మహాయుతి కూటమి శాసనసభ ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించి మహావికాస్ అఘాడిపై ప్రతీకారం తీర్చుకుందనే చెప్పాలి.

దక్కని ప్రతిపక్ష హోదా!

ఆరు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికలలో 30 స్థానాలలో విజయం సాధించిన మహావికాస్ అఘాడి పరాజయం ఏ స్థాయిలో ఉందంటే ప్రతిపక్ష పార్టీ హోదా పొందటానికి కావలసిన 29 శాసనసభ స్థానాలను కూడా కూటమిలోని ఏ ఒక్క పార్టీ గెలవలేకపోయింది. మహారాష్ట్ర శాసనసభలో 10 శాతం అంటే 29 శాసనసభ స్థానాలలో గెలుపొందిన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా దక్కుతుంది. కానీ మహా వికాస్ అఘాడి కూటమిలో 20 శాసనసభ స్థానాలలో ఉద్ధవ్ థాక్రే శివసేన, 16 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ, 10 చోట్ల శరద్ పవార్ ఎన్‌సీపీలు విజయం సాధించాయి.

కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా మహావికాస్ ఆఘాడి కూటమిలోని ఏ పార్టీకి దక్కే అవకాశాలు కూడా లేవు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాకు కావలసిన పద్దెనిమిది శాసనసభ స్థానాలలో విజయం సాధించకపోవడం వలన(వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది) ఆ పార్టీ కూడా శాసనసభలో ప్రతిపక్ష పార్టీ హోదాను దక్కించుకోలేకపోయింది.

ఓదార్పు విజయం 

ఇండియా కూటమికి మహారాష్ట్రలో పరాజయం ఎదురైనా జార్ఖండ్‌లో మా త్రం ఓదార్పు విజయం దక్కిందనే చెప్పా లి. జార్ఖండ్‌లో కూడా ఎన్‌డీఏ కూటమికి విజ యం దక్కుతుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జేఎం ఎం నేతృ త్వంలోని ఇండియా కూటమి విజయం సాధించింది. మొత్తం 81 శాసనసభ స్థానా లు ఉన్న జార్ఖండ్‌లో ఇండియా కూటమి 56 స్థానాలలో విజయం సాధించి పరువు కాపాడుకుంది. జార్ఖండ్‌లో విజయంపై ఎన్‌డీఏ కూటమి పెద్దగా నే ఆశలు పెట్టుకుంది కానీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమం త్ సొరేన్ ఒంటి చేత్తో ఇండి యా కూటమికి విజయం సాధించి పెట్టారు.

ఎన్నికలకు ముందు హేమంత్ సొరేన్ అరెస్ట్ వలన వచ్చిన సానుభూతి, గిరిజన వర్గాలలో తన పట్టు నిలుపు కోవటం, ‘సీఎం మయ్యా యోజన’ లాంటి పథకాలు ఆయ న విజయానికి దోహదపడ్డాయి. వదిన సీతాసొ రేన్, మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నాయకుడు చంపై సొరేన్ పార్టీని వీడినా హేమంత్ సోరేన్ ఇండియా కూటమిని విజయ తీరాలకు చేర్చారు. బీజేపీ ప్రచారం చేసిన అవినీతి, బంగ్లాదేశ్ అక్రమ వలసలు జార్ఖండ్ ప్రజలను మెప్పించ లేకపోవటం వలన రాష్ట్రంలో బిజెపి గెలవకపో గా అసెంబ్లీలో బలం కూడా తగ్గిపోయింది. 

 ఇక వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో గాంధీ కుటుంబం నుండి లోక్ సభలోకి అడుగుపెట్టిన పదవ వ్యక్తి  ప్రియాంక గాంధీ వాద్రా నాలుగు లక్షల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించటం కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊరట నిచ్చే అంశం. లోక్ సభలో ప్రభుత్వంపై పోరాడటానికి ఇండి యా కూటమి నుండి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తోడుగా గౌరవ్ గొగోయ్, సుప్రియా సూలే, కళ్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రాలతో పాటు ప్రియాంక గాంధీ రూపంలో మరొక బలమైన నేత దొరికినట్లుగానే భావించాలి. లోక్ సభలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీకి అదనపు ఆకర్షణ, బలంగా మారబోతున్నారు. 

బీహార్, ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఢిల్లీ, బీహార్ శాసనసభ ఎన్నికలపై కూడా పడే అవకాశం లేకపోలేదు. ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌ల మధ్య పొత్తుకుదిరే అవకాశాలు కనిపించటం లేదు. బీహార్‌లో బలం లేకపోయి నా గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాసనసభ స్థానాలు తీసుకొని ఓడిపోవడంతో కొద్దిపాటి తేడాతో ఆర్జేడీ అధికారానికి దూరమైంది. బీహార్‌లో కాంగ్రె స్ అనుసరించే వైఖరి జయాపజయాలను ప్రభావితం చేస్తుంది.

కాంగ్రెస్ మిత్ర పక్షాలపట్ల తన వైఖరి మార్చుకోకపోతే ఇండియా కూటమికి, కాంగ్రెస్‌కు నష్టం. బీజేపీని నిలువరించే పరిణితి చెందిన రాజకీ యాన్ని ఆ జాతీయ పార్టీ ప్రదర్శించాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రైతులను మోసం చేసిందని, మహాలక్ష్మి పథకంతో మహిళలను మోసం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలో అనేక బహిరంగ సభలలో ప్రచారం చేయటం మహా వికాస్ ఆఘాడికి నష్టం చేసింది. కాబట్టి కాంగ్రెస్ తన విధానాల పట్ల పునరాలోచన చేసుకోకపోతే బీజేపీని భవిష్యత్తులో ఎదుర్కోవటం కష్టమే కాదు ఇండియా కూటమి ని సమైక్యంగా ఉంచటం కూడా సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

- వ్యాసకర్త సెల్ : 9885465877

డాక్టర్ తిరుణహరి శేషు