calender_icon.png 28 November, 2024 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబళించిన మృత్యువు

26-09-2024 01:53:45 AM

మూడు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు

ఒకేరోజు 12 మంది దుర్మరణం

మెదక్/యాదాద్రి భువనగిరి/రంగారెడ్డి, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఒకేరోజు మూడు జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 12మంది దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. మెదక్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి చెందారు.

హవేళీఘణపూర్ మండలం ఫరీద్‌పూర్ శివారులో ఆటో, ద్విచక్రవాహనం ఢీకొని మెదక్ మండలం మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన మల్లేశం(35) అక్కడికక్కడే మృతి చెందగా కొల్చారం మండలం కొంగోడు గ్రామానికి చెందిన మేకల ఎల్లం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. హవేళీఘణపూర్ మండలం కాప్రాయిపల్లిలో విద్యుత్‌ఘాతంతో కుక్కల రాజు(30) మృతి చెందాడు. 

అలాగే మెదక్ జాతీయ రహదారిపై అవుసులపల్లి సమీపంలో ఆగివున్న లారీని పాల ఆటో ఢీకొట్టిన ఘటనలో నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటకు చెందిన నరేష్‌గౌడ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. శివ్వంపేట మండలం శభాష్‌పల్లి గ్రామానికి చెందిన పడిగె బాబు (31) భార్యతో గొడవపడి పిల్లిగుండ్ల మత్తడి చెక్‌డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

హవేళీఘణపూర్ మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన గోపాల్(45) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. తూప్రాన్ మండలం ఘణపూర్‌లో వంశీ (20) ఈనెల 18న గ్రామంలో గొడవ కారణంగా మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

పెద్దశంకరంపేటకు చెందిన మెల్ల శ్రీనివాస్‌చారి(58) కుటుంబ కలహాల నేపథ్యంలో బుధవారం చెరువులో దూకి చనిపోయాడు. అలాగే అల్లాదుర్గం మండలంలోని చేవెళ్ల గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక శివకుమార్ (35) ఆత్మహత్య చేసుకున్నాడు.

చిన్నశంకరంపేట మండలం శాలిపేటకి చెందిన భూస రమేశ్(38) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు 9 మంది మృత్యువాత పడటంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో..

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన జీహెచ్‌ఎంసీ కార్మికురాలు బరిగల రాములమ్మ (67) బుధవారం పనులను ముగించుకొని గుంతపల్లికి వెళ్లేందుకు హయత్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో బస్సు ముందలి టైర్ల కిందపడి తీవ్రగాయాలపాలయ్యింది.

ఈ క్రమంలో ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాములమ్మ మృతి చెందింది. అలాగే మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ డంపిగ్ యార్డు ఎదురుగా రోడ్డుపై ఏర్పడిన గుంతలను తప్పించబోయి.. తిమ్మాయిపల్లి మాజీ ఎంపీటీసీ భర్త అమరేందర్ (55) స్కూటీతో సహా రోడ్డుపై పడిపోగా అతడి స్కూటీని డీసీఎం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

ఆర్ధిక ఇబ్బందులతో..

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అర్బన్ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు ముదిగొండ శివశంకర్ కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం పట్టణంలోని ఆర్బీనగర్‌లోని తన దుకాణంలో ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు.