calender_icon.png 19 January, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబళిస్తున్న కల్తీ భూతం

06-10-2024 12:00:00 AM

హైదరాబాద్ నగరం ప్రాచీనకాలంనుంచి కూడా రుచికరమైన, పరిశుభ్రమైన వంటకాలకు ప్రసిద్ధి. నిజాం కాలంనుంచి హైదరాబాద్ నగరం బిర్యానీ, ఇతర మొగలాయి వంటకాలకు ప్రపం చంలో తిరుగులేని బ్రాండ్‌గా ఉంది. అయితే కాలక్రమంలో నగర జనాభా పెరిగింది. ప్రతి రోజూ లక్షకు పైచిలుకు ప్రజలు వివిధ కారణాలతో, అవసరాలతో నగరానికి వస్తున్నారు.

దేశం నలుమూ లలనుంచి ప్రజలు వచ్చి ఈ చారిత్రక నగరంలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. ఆంధ్రాహోటళ్లు, ఉడుపి హోటళ్లు, కామత్ హోటళ్లు, పాలమూరు హోటళ్లు నగరంలో కొలువుదీరాయి. వివిధ రకాల రుచులతో వంటకాలు ఊరిస్తున్నాయి. కానీ ఇటీవల నగరంలో పేరుమోసిన హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ, నియంత్రణ అధికారులు దాడులు చేసి తనిఖీలు నిర్వహించినప్పుడు భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి.

ఎలుకలు, బొద్దింకలు, ఇతర క్రిమి కీటకాలు వంట గదుల్లో, స్టోర్ రూమ్‌లలో స్వైరవిహారం చేస్తూ కనిపించాయి. అలాగే కుళ్లిన మాంసం, నాసిరకం మసాలాలు, కల్తీ వంటనూనెలు కుప్పలు తెప్పలుగా కనిపించాయి. హోటళ్లలోనే కాకుండా కిరాణా దుకాణాల్లో, సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌లోనూ జరిపిన తనిఖీల్లో సైతం ఆహార వస్తువుల్లో విపరీతమైన కల్తీ కనిపించింది.

ఈ కల్తీ పదార్థాలు సైలెంట్ కిల్లర్స్‌గా ప్రతి ఇంటిలోనూ తిష్ఠ వేశాయి. ఇక రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు , తినుబండారాల బండ్లలాంటి గురించి ఎంత తక్కు చెప్పుకుంటే అంతమంచింది. ఈ ఆహార కల్తీతో క్యాన్సర్, కిడ్నీలు దెబ్బతినడం, నాడీ సంబంధిత రుగ్మతలు, ఫుడ్ ఎలర్జీ, కడుపునొప్పి లాంటి అనేక జబ్బులు వస్తున్నాయి. రోగాలు వస్తే వేసుకునే టాబ్లెట్లు అన్నీ కూడా నాసిరకంవే దర్శనమిస్తున్నాయి.

ఈ కల్తీ సంక్షోభాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చాలెంజ్‌గా తీసుకోవాలి. తనిఖీ అధికారులను, శాస్త్రవేత్తల సంఖ్యను తగురీతిలో పెంచాలి. టెస్టింగ్ ల్యాబ్‌లను అన్ని హంగులతో సమకూర్చాలి. తనిఖీలు మొక్కుబడిగా కాకుండా ముమ్మరంగా జరపాలి. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం పనికి రాదు.

ప్రజారోగ్యానికి వైద్య చికిత్సలు ఎంత ముఖ్యమో కల్తీ నివారణ కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలి. వ్యాపారులు కూడా తమ వ్యాపారాన్ని పెంచుకోవడమే కాకుండా కస్టమర్ల ఆరోగ్యం, పరిశుభ్రతపై దృష్టి పెట్లాలి. లేకపోతే నగరాలు, పట్టణాలు కల్తీ ఆహారానికి నిలయాలుగా మారిపోతాయి.

 డా. కోలాహలం రామ్‌కిశోర్, 

హైదరాబాద్