calender_icon.png 30 October, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2047 నాటికి వికసిత్ భారత్

30-10-2024 12:08:40 AM

  1. యువశక్తి సామర్థ్యం ద్వారానే భవ్యమైన భారత్ 
  2. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  3. రోజ్‌గార్ మేళాలో 180 మందికి జాబ్ ఆఫర్ లెటర్లు అందజేత

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవం (2047) నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని మోదీ గత పదేళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు.

రానున్న 25 ఏళ్లలో యువశక్తిని అపారంగా వినియోగించుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కింగ్ కోఠిలోని భారతీయ విద్యా భవన్‌లో మంగళవారం నిర్వహించిన రోజ్‌గార్ మేళా కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ మేళాలో వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన 180 మందికి ఆఫర్ లెటర్లను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రదాని మోదీ ఉపన్యాసాన్ని స్క్రీన్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భారత్‌లో అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన యువత ఉన్నారని, వీరి మేధస్సుతో ప్రపంచాన్ని శాసించవచ్చన్నారు.

దేశంలో 33 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారని.. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతికతను విద్యా విధానంలో తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే 75 దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్టు చెప్పారు.

డిఫెన్స్ రంగంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, దేశాభివృద్ధిలో  వారిని భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ నేషన్ ఫస్ట్ అనే నినాదంతో పనిచేయాలని సూచించారు. 

ఏడాది పాటు పటేల్ జయంతి ఉత్సవాలు

సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోనే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందని కిషన్‌రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఏక్తా దివాస్ (అక్టోబర్ 31)ను పురస్కరించుకుని 2025 అక్టోబర్ 31 వరకు ఏడాది పాటు జయంత్యోత్సవాలు గ్రామగ్రామాన నిర్వహిస్తామని అన్నారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ సమీపంలోని పటేల్ విగ్రహానికి కిషన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. నిజాం సైన్యంపై జరిగిన పోరాటంపై ఈ తరానికి అవగాహన కల్పించేలా ఈ జయంత్యోత్సవాలు నిర్వహిస్తామన్నారు.

ఈ ఉత్సవంలో అమరవీరుల కుటుంబాలతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, స్వాతంత్య్ర సమరయోధులు అందరిని మమేకం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.