28-04-2025 11:37:37 PM
కలెక్టర్లు, ఎస్పీలతో అధికారుల వరుస సమావేశాలు...
ఢిల్లీ: దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (యూజీ) పరీక్షకు కేంద్ర విద్యాశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. గతేడాది ప్రశ్నాపత్రం లీకేజీ, అవకతవకల ఆరోపణలతో తీవ్ర దుమారం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 4న దేశవ్యాప్తంగా 550 నగరాల్లోని 5 వేలకు పైగా పరీక్ష కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగనుంది. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వరుస సమావేశాలుగా నిర్వహిస్తూ చర్చలు జరుపుతున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
లాజిస్టిక్స్, భద్రత వంటి కీలక అంశాలపై చర్చిస్తూ అందరినీ సన్నద్ధం చేస్తున్నారు. మరోవైపు, ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద ఎన్‌టీఏ ఏర్పాటు చేసే భద్రతతో పాటు ఆయా జిల్లాల పోలీస్ భద్రతతో బహుళ అంచెల్లో తనిఖీలు చేపట్టనున్నారు.ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు వంటి కీలకమైన సామగ్రి రవాణా పూర్తిగా పోలీసు భద్రతలోనే కొనసాగుతుంది. అలాగే, వ్యవస్థీకృత మోసాలను అరికట్టేందుకు కోచింగ్ సెంటర్లు, డిజిటల్ ప్లాట్‌ఫాంల కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో తప్పనిసరిగా తనిఖీలు చేపట్టేలా డ్యూటీ మెజిస్ట్రేట్‌లను నియమిస్తున్నారు.