calender_icon.png 22 October, 2024 | 11:08 PM

మరణం లేని మహావీరుడు

22-10-2024 12:00:00 AM

నేడు కొమురం భీం జయంతి :

వీరుడు ఎప్పటికీ మరణించడు. ఆ స్ఫూర్తి అలా కొనసాగుతూనే ఉంటుంది. నిజంగానే అత ను ఒక అగ్గి బరాటా. అనూహ్య పోరాట యోధుడు. గెరిల్లా తరహా పోరాటంలో సిద్ధహస్తుడు. మడమ తిప్ప ని త్యాగధనుడు. ఆయనే కొమురం భీమ్. ఈ పేరు చెబితేనే ఒకనాటి నిజాం సర్కారుకు దడ పుట్టేదంటే, ఆయన ధైర్యసాహసాలను అర్థం చేసుకోవచ్చు.  

స్వయంపాలన కోసం శ్రమించిన తెలంగాణ బిడ్డ కొమురం భీమ్. 1901 అక్టోబర్ 22న భీమ్ జన్మించాడు. హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జాహీ రాజ వాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఆదిలాబాద్ అడవులలోని గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించా డు.

తల్లిదండ్రులు కొమురం చిన్నూ-, సోంబాయి దంపతులది ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామం. 15 ఏళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడి లో తండ్రి మరణించగా, కొమురం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. అన్ని రకాల నిజాం అధికారాలను తోసి పుచ్చాడు. నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి చివరకు వీరమరణం పొందాడు. 

యుక్తవయసులోనే తండ్రి మరణం

భారతదేశంలో ఆదివాసీల హక్కులకోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మకమైనవి. వారిపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్ ‘జల్ -జంగిల్ -జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచాడు. 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన భీమ్, నైజాం సర్కార్ గుండెల్లో సింహస్వప్నం అయ్యాడు.

సర్దాపూర్‌లో సాగు చేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అనే జమీందారు ఆక్రమించుకున్నాడు. దీంతో ఆవేశం పట్టలేని భీమ్ అతణ్ణి హతమార్చి, అటునుంచి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన తర్వాత తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్క తాటిపై నడిపించాడు.

ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటం సాగించాడు. భీమ్‌కు కుడిభుజంగా కొమురం సూరు ఉద్యమంలో పాల్గొన్నాడు. వెడ్మ రాము కూడా భీమ్‌కు సహచరుడిగా ఉన్నాడు. చివరకు కుర్దు పటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27న జోడేఘాట్ అడవుల్లోని భీమ్ స్థావరాన్ని ముట్టడించి, ఆయనను బలి తీసుకొంది. ఆదివాసీలు ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున భీమ్ వీర మరణం పొందాడు. అప్పటి నుంచీ ఆ తిథి రోజునే ఆయన వర్ధంతిని జరుపుకుంటున్నారు.

ఆత్మగౌరవ ప్రతీక 

ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీమ్. పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలకు అదే విముక్తినిస్తుందని అక్షరాల నమ్మాడు. ఆదిలాబాద్ అడవుల్లో భీమ్ సాగించిన పోరాటానికి 72 రెండు ఏళ్లు పూర్తి కావస్తున్నది.

ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీమ్ వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. స్వయంపాలన కోసం తెలంగాణ ప్రజలు అలుపెరగకుండా ఉద్యమిస్తున్న సంద ర్భం నేడున్నది. ఆదివాసీ సమాజాలను క్రూరంగా అణచివేస్తున్న ప్రభుత్వాలు కండ్లముందు ఇప్పటికీ మనకు కనబడుతున్నాయి.

దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీలు ఉద్యమించిన సందర్భాలు చరిత్ర లో అనేకం ఉన్నాయి. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సాముండా, సంతాల్లు తిరుగుబాటు చేశారు. జల్, జంగల్, జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్ని రకాల దోపిడీ, పీడనలను వారు ప్రాణాలకు తెగించి, ఎదిరించారు. 

పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పంట వేస్తే అది ‘జంగ్లాత్ భూమి’ అని ఒకరు, ‘కాదు రెవెన్యూ భూమి’ అని మరొకరు వచ్చి గోండులను వారి భూముల నుంచి తరిమేశారు. పంటలను ధ్వంసం చేశారు. జరిమానాలతో వేధించారు. ఈ నేపథ్యమే ఆదిలాబాద్ గోండన్నలను పోరుబాట పట్టించింది.

కొమురం భీమ్ పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించే లోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది. భీమ్‌తోసహా పన్నెండు మంది ఆదివాసీ వీరులు అమరులయ్యారు. నిజాం సర్కారు పాశవికంగా వారి పోరాటాన్ని అణచి వేసింది. భీమ్ అమరత్వం జోడేఘాట్ ప్రాంతాలలో నేటికీ ప్రతిధ్వనిస్తున్నది. 

ప్రభుత్వం పట్టించుకోవాలి

ప్రజాస్వామిక రాజ్యమని చెప్పుకుంటున్న నేడు కూడా ఆదివాసుల స్థితిగతుల్లో ఏమీ మార్పు రాలేదు. నిజాం రాజు నియమించిన హైమండార్ఫ్ సూచనలనూ నేటి పాలకులు పాటించడం లేదు. ఆదివాసు లపై సవతి తల్లి ప్రేమనే ప్రదర్శిస్తున్నారు. కొమురం భీమ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.

వారిని నిత్యం స్మరించుకునేలా ఆసిఫాబాద్ జిల్లా కొమురం భీమ్ పేరు పెట్టడం ఎంతో సముచితం. ఆదివాసుల సంక్షేమానికి ప్రభుత్వం బేషరతుగా పెద్ద పీట వేయాలి. వారికి మంచి విద్య, వైద్యం అందుబాటులో ఉంచాలి. తెలంగాణలోని ప్రతి జిల్లాలో కొమురం భీమ్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలి.

 కామిడి సతీష్‌రెడ్డి