calender_icon.png 11 January, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమె పాటకు ఓ శాపం!

25-06-2024 12:05:00 AM

అల్కా యాజ్ఞిక్.. బాలీవుడ్‌లో ఓ సెన్సేషన్ మెలోడీ క్వీన్. ఆమె పాటలకు సంగీత ప్రియులు చెవి కోసుకుంటారు. అల్కా మనోహరమైన గాత్రానికి ఎంతోమంది ప్రేమలో పడిపోయారు. 90ల నాటి ఈ మెలోడీ క్వీన్ 16కు పైగా భాషల్లో వేల పాటలు పాడారు. ఏడు సార్లు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు ను గెలుచుకున్నారు. ‘చోళీ కే పీచే ఖ్యాహే’..‘ఏక్ దో తీన్’.. ‘మేరీ మెహబూబా’.. ‘తాల్ సే తాల్’.. ‘దిల్ నే యే కహా హై దిల్ సే’.. ‘ఓ రే చోరీ’.. ‘హమ్ తుమ్’.. ‘కుచ్ కుచ్’.. ‘ప్యార్ హై’.. ‘సాన్ సాన్ సనా’.. ‘అగర్ తుమ్ సాథ్ హో’.. ఇలా సూపర్ డూపర్ సాంగ్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ లిస్ట్ చాలా పెద్దది.

సెన్సరీ న్యురల్ హియరింగ్ లాస్..

బాలీవుడ్ సింగర్ అల్కా యాజ్ఞిక్ పాటకు అందరూ ప్రేమలో పడిపోతారు. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించి సంగీత ప్రపంచాన్ని ఊర్రూత లూగించారు. అయితే గత కొన్నాళ్లుగా తాను వినికిడి లోపంతో బాధపడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నారు. జూన్ 17న పెట్టిన ఈ పోస్టులో న్యూరల్ నర్వ్ సెన్సరీ లాస్ వల్ల తనకు ఈ అరుదైన సమస్య వచ్చినట్టు ఆమె రాసుకొచ్చారు. 

‘నా అభిమానులు, స్నేహితులు, అనుచరులు, శ్రేయోభిలాషులు అందరూ ఈ పరిస్థితుల్లో అండగా నిలవాలి’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. రెండున్నర నెలల కిందట అల్కా ముంబై నుంచి గోవాకు విమానంలో ప్రయాణించారు. అప్పుడు విమానం దిగుతున్న సమయంలో తనకు ఏదీ వినబడటం లేదని గ్రహించారు. మరుసటి రోజు డాక్టర్‌ను సంప్రదించగా అల్కాకు వినికిడికి సంబంధించిన నాడుల సమస్య ఉన్నట్టు నిర్ధారణ అయింది. వైరస్ దాడి కారణంగా ఇలా జరిగిందని ఆమె తన పోస్టులో వెల్లడించారు. 

చెవి లోపలి భాగానికి గాయం కావడం, లేదంటే దెబ్బతినడం వల్ల ఈ విధమైన వినికిడి లోపం తలెత్తుతుందని అమెరికన్ స్వీచ్ లాంగ్వేజ్ హియరింగ్ అసోసియేషన్ వెబ్‌సైట్ తెలిపింది. చెవి లోపలి భాగంలోని నరాలకు ఏదైనా అడ్డు రావడం వల్ల మెదడుతో కమ్యూనికేషన్‌లో అవరోధాలు ఏర్పడతాయి. కొందరికి దీనివల్ల చిన్నచిన్న శబ్దాల ను వినడం కష్టమవుతుంది. పెద్ద శబ్దాలూ కొన్నిసార్లు అస్పష్టంగా వినిపిస్తాయి.

ఈ రకమైన లోపం చాలాసార్లు శాశ్వతంగా ఉంటుంది. ఇది మందులకు గానీ, శస్త్ర చికిత్స కు గానీ లొంగదు. ఇలాంటి వినికిడి లోపాలకు హియరింగ్ ఎయిడ్ లాంటి సాధానాలు అవసరమవుతాయి. అనారోగ్యం, వంశపారంపర్యం, వృద్ధాప్యం, తలకు దెబ్బతగలడం, చెవి అంతర్ నిర్మాణంలో లోపాలు, పేలుళ్ళు, భారీ శబ్దాలు వినడం లాంటి కారణాల వల్ల ఈ రకమైన వినికిడి లోపం తలెత్తుతుంది. 

హెడ్‌ఫోన్ కల్చర్‌తో జాగ్రత్త..

ఆ పోస్టులో అల్కా మరింతగా వివరణ ఇస్తూ.. “నాకు చాలా అరుదైన సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ (వినికిడి లోపం) ఏర్పడిందని మా డాక్టర్ నిర్ధారించారు. ఇది వైరల్ అటాక్ వల్ల వచ్చింది. ఇది నాకు ఊహించని షాక్. నేను ఇప్పటికీ ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎక్కువ శబ్దంతో సంగీతాన్ని వినడం, హెడ్‌ఫోన్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి జాగ్రత్తగా ఉండమని నా అభిమానులను హెచ్చరిస్తున్నాను.

నా వృత్తిలో ఉన్న ఇలాంటి ప్రమాదాల గురించి ఏదో ఒక రోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ ప్రేమాభిమానాలతో నేను ఈ సమస్య నుంచి బయటపడి మళ్లీ మీకు చేరువకాగలనని ఆశిస్తున్నాను. ఈ కష్ట సమయంలో మీ సహకారం చాలా కీలకమైంది.” అని రాసుకొచ్చారు.