calender_icon.png 19 January, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాపు, దర్పం చూపితే.. బొక్కలేసుడే!

07-12-2024 02:13:37 AM

  1. హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల పేరు వినిపించొద్దు
  2. హోంశాఖ విజయోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి 
  3. సామాన్యులు, ప్రజాప్రతినిధుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి
  4. నేరస్థుడికి ప్రొటోకాల్ ఉండదు.. పోలీస్ అంటే నేరగాడు భయపడాలి

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (విజయ క్రాంతి): ‘నేరగాడికి హోదా, ప్రొటోకాల్ ఉండదు. పోలీసులు నేరస్థుల పట్ల కఠినంగా ఉంటూ బాధితుల పట్ల సానుభూతి చూపాలి. పోలీస్ స్టేషన్‌కు వచ్చే సామాన్యులు, ప్రజాప్రతినిధుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. ఎవరైనా డాపు, దర్పం ప్రదర్శిస్తే బొక్కలో వేయాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసులకు చెప్పారు.

పోలీస్ అంటేనే నేరగాడు భయపడాలని, శాంతి భద్రతలు కాపాడి పోలీసులు తెలంగాణ ప్రతిష్ఠ పెంచాలని ఆయన సూచించారు. ప్రజాపాలన ప్రజావిజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో హోంశాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, డీజీపీ డా.జితేందర్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వేదికపై ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. పోలీస్ బ్యాండ్, ఆక్టోపస్ బృందం, పోలీస్ జాగిలాల విన్యాసాలను వీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద న్నారు. హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల పేరు వినిపించొద్దన్నారు. తెలంగాణలో గంజాయి, కొకైన్, లాంటి మత్తు పదార్థాలను నివారించడమే లక్ష్యంగా డీజీపీ స్థాయి అధికారిని నియమించి వాటిని నిర్మూలించే దిశగా ముందుకుసాగుతున్నామని చెప్పారు. 

న్యాయం చేయడమే ఫ్రెండ్లీ పోలీస్ 

బాధితులకు న్యాయం చేయడమే ఫ్రెండ్లీ పోలీ స్ అని, కబ్జాలు, హత్యలు, ఆర్థిక నేరగాళ్లకు అండ గా నిలవడం ఫ్రెండ్లీ పోలీస్ కాదన్నారు. శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యం కాబట్టి తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 15వేల మందికి నియామక పత్రాలందించామన్నారు.

జంక్షన్లలో భిక్షాటన చూస్తూ సమాజంలో చిన్న చూపునకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ హోంగార్డులుగా తీసుకోవాలని డీజీపీ, నగర సీపీ కి సూచించినట్లు చెప్పారు. 47మంది ట్రాన్స్‌జెండర్లను నియమించామని, భవిష్యత్‌లో మరింత మందిని నియమి స్తామని చెప్పారు. తర్వాత హోంగార్డులుగా శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్లకు  నియామక పత్రాలను అందజేశారు. 

అర్హతగల వారికి బాధ్యతలు..

పోలీస్ ఉద్యోగం ఉపాధి కాదని, భావోద్వేగమ ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో హోంగార్డు నుంచి డీజీపీ వరకు రాజకీయ ఒత్తిడిలో ఉద్యోగాలు చేశారన్నారు. ఏడాదిపాటుగా రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలకు తావు లేకుండా అర్హత గల అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు, హోదాలను ఇచ్చిందని చెప్పారు. ఏ అధికారికైనా టీవీల్లో వచ్చేవరకు వారికి ఇచ్చిన బాధ్యతలేవో తెలియదన్నారు.

ప్రభుత్వంలో అత్యంత కష్టపడేది పోలీసులే.. చెడ్డపేరు, విమర్శలు వచ్చేది పోలీసులకేనని చెప్పారు. తమ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుందని కష్టపడి పనిచేసి మంచిపేరు తీసుకురావాలన్నారు. తెలంగాణ పోలీసులు సైబర్‌క్రైమ్ నియంత్రణలో చేసిన కృషిని అభినందిస్తూ మన పోలీసులు కేంద్ర హోంశాఖ మంత్రి ద్వారా అవార్డును అందుకున్నారని కొనియాడారు.

రాష్ట్రంలో మత్తుపదార్థాల నియంత్రణకు ఆక్టోపస్, గ్రేహౌం డ్స్ మాదిరి బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డీజీపీకి సూచించా రు. పోలీసు సిబ్బందిలోని బీటెక్, ఎంటెక్ చదివిన వారిని గుర్తించి సైబర్‌క్రైమ్, డ్రగ్స్ నియంత్రణ కోసం ఏసీబీ, సీఐడీ మాదిరిగా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. గత సంవత్సరం సైబర్ క్రైమ్ ద్వారా రూ. 10 కోట్లు రికవరీ చేసి బాధితులకు ఇచ్చారని కొనియాడారు. 

విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలైతే.. 

మాదకద్రవ్యాలతో తెలంగాణ పేరు మసకబారొద్దని సీఎం రేవంత్‌రెడ్డి  అన్నారు. కాలేజీలు, స్కూళ్లలోని విద్యార్థులు మత్తుపదార్థాల బారినపడే అవకాశముందన్నారు.  స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ కేసులు వస్తే యాజమాన్యాలూ బాధ్యులేనని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడమే  డ్రగ్స్ నియంత్రణ లో భాగంగా యాజమాన్యాలు విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించే విధంగా ప్రత్యేక సిబ్బందిని నియ మించుకోవాలని చెప్పారు.  

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్

హోంగార్డు నుంచి డీజీపీ వరకు 24గంటలు శాంతి భద్రతలను కాపాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ వారి పిల్లలకు ఉద్యోగావకా శాల్లో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి విద్యాసంస్థలకు ధీటుగా, ఎన్‌డీఏ, సైనిక్ స్కూల్స్ మాదిరిగా యంగ్ ఇండి యా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

టెర్రరిస్టులతో పోరాడుతూ చనిపోతే రూ.2కోట్ల ఎక్స్‌గ్రేషియా

ఐపీఎస్ అధికారులు ఎవరైనా టెర్రరిస్టులతో పోరాడుతూ చనిపోతే ప్రభుత్వం నుంచి రూ.2కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డీఎస్పీ, నాన్ క్యాడర్ అధికారులు చనిపోతే రూ.1.50 కోట్లు, ఆ కింది క్యాడర్ వారికి రూ.1.25కోట్లు, ఆ కింది స్థాయి వారికి రూ.1 కోటి పరిహారం చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 40వేల మంది హోంగార్డులున్నారని,  శుక్రవారం వారి రైజింగ్ డే సందర్భంగా హానరోరియంను రోజుకు రూ.920 నుంచి రూ.వెయ్యికి పెంచుతున్నామని ప్రకటించారు. పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.

2వేల మందితో ఎస్‌డీఆర్‌ఎఫ్ 

అంతకు ముందు ట్యాంక్‌బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ్‌లో కేంద్ర విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్‌ఎఫ్) మాదిరిగా రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్‌డీఆర్‌ఎఫ్)ను సీఎం రేవంత్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. రెండు వేల మంది సిబ్బంది తో దీనిని ప్రారంభించారు.

ఎస్‌డీ ఆర్‌ఎఫ్ బోటులు, ఫైర్‌ఇంజన్లు, డీఆర్‌ఎఫ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.  అగ్నిమాపక శాఖలోని ఫైర్‌స్టేషన్లు ఇక నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్ స్టేషన్లుగా మారనున్నాయి. భారీ అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు వంటి వైపరీత్యాలు వచ్చినపుడు ఎస్డీఆర్‌ఎఫ్  అత్యవసర సహాయక చర్యలు చేపడుతుంది. 

నిష్ణాతులతో ప్రత్యేక బృందం: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కోవడానికి నిష్ణాతులైన పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రభు త్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను బలోపేతం చేసిందని చెప్పారు. ఇటీవల ఖమ్మంలో వచ్చిన వరుదల ను దృష్టిలో ఉంచుకుని, విపత్తులు వస్తే కేంద్ర బలగాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుం డా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను బలోపేతం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.

పోలీసులకు ఏ కష్టం వచ్చినా తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్వేచ్ఛ గా, స్వతంత్రంగా పని చేసేందుకు కావలసిన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. కొంతమంది కోసం కాకుండా అందరి అవసరాల కోసం పోలీస్ వ్యవస్థ పని చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో గందరగోళాన్ని సృష్టించి శాంతిభద్రతల సమస్యను తీసుకొచ్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

వారి కుట్రలు సాగనివ్వమన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు అందరు కలిసి పునాదులు వేద్దామన్నారు. ట్రాన్స్‌జెండర్లను పోలీస్ శాఖలో భాగస్వామ్యం చేసిన తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.