- బెంగాల్ అసెంబ్లీలో అత్యాచార నిరోధక బిల్లుకు ఆమోదం
- దోషులకు మరణశిక్ష
- చార్జిషీట్ దాఖలైన 36 రోజుల్లో శిక్ష అమలయ్యేలా చట్టం
కోల్‌కతా, సెప్టెంబర్ 3: ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్య ఘటన బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్న వేళ మమతా సర్కారు అసెంబ్లీలో కీలక బిల్లును ఆమోదించి ంది. అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును బెంగాల్ న్యాయమంత్రి మోలోయ్ గాతక్ శాసనసభలో ప్రవేశపెట్టగా బెంగాల్ ఆసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం, లైంగిక నేరాలకు సంబంధించి శిక్షలను కఠినతరం చేస్తూ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనున్నారు. మహిళలు, చిన్నారుల రక్షణను మెరుగుపరచటమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
బిల్లులోని అంశాలు
- అత్యాచారం, హత్య కేసుల్లో మరణశిక్ష విధించేలా చర్యలు
- చార్జిషీట్ దాఖలు చేసిన 36 రోజుల్లోగా మరణశిక్ష విధించేలా నిబంధనలు
- అత్యాచారం మాత్రమే కాకుండా యాసిడ్ దాడి కూడా అంతే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. దీనికి జీవిత ఖైదు విధించేలా నిబంధనలు
- అపరాజితా టాస్క్‌ఫోర్స్ అత్యాచారం, యాసిడ్ దాడి లేదా వేధింపుల కేసుల్లో చర్య తీసుకుంటుంది
- ఎవరైనా బాధితురాలి గుర్తింపును వెల్లడిస్తే, కఠిన చర్యలు తీసుకుంటారు
కొన్ని రోజులుగా అత్యాచారాలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కఠినమైన శిక్షలు ఉండేలా బిల్లును తీసుకొస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెబుతూ వస్తున్నారు. ఆ మాట ప్రకారమే సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో దీదీ సర్కారు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం తెలుపకపోతే నిరసన చేపడుతామని హెచ్చరించారు.