calender_icon.png 1 April, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్, బెట్టింగులపై ఉక్కుపాదం

30-03-2025 07:44:31 PM

ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..

జిల్లాలోనే మొట్టమొదటి సీసీ కెమెరాల పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవం.. 

హైకోర్టు అడ్వకేట్లు వామన్ రావు దంపతుల హంతకులకు శిక్ష తప్పదు.. 

ఏప్రిల్ 13న శ్రీపాద వర్ధంతి నాడు ఐ హాస్పిటల్ ప్రారంభం.. 

ఉగాది కానుకగా కాటారం ప్రాంతానికి పరిశ్రమలు తీసుకువస్తా..

కాటారం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాదక ద్రవ్యాల నిరోధం, బెట్టింగ్ ఆప్(Betting App) ల వ్యవహారంపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. ఆదివారం ఉగాది పండుగ రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ లో దాతల సహకారంతో 34 లక్షల రూపాయల వ్యయంతో, జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 63 సీసీ కెమెరాలతో అనుసంధానం చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్(Police Command Control Room) ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభోత్సవం చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... హోంశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తరపున ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తాను మాట్లాడడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల వినియోగాన్ని రూపుమాపడానికి, క్రింది స్థాయి హోంగార్డు, కానిస్టేబుల్ నుంచి మొదలుకొని ఎస్పీ స్థాయి వరకు అంకితభావంతో పనిచేయాలని కోరారు. మాదక ద్రవ్యం (Drugs)కు అలవాటు పడిన వారిని, ప్రోత్సాహం చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా ఆదేశించారు. కొంతమంది యువతరం తెలుసో, తెలియక కొన్ని ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారని, సమాజానికి విఘాతం కలుగుతుందని అన్నారు. డ్రగ్స్ ను సోషల్ ఏవిల్ గా పేర్కొన్నారు.  వాటిని నియంత్రించాల్సిన బాధ్యత మన పైన కూడా ఉందని, యువతరాన్ని సరైన నడక నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

అదేవిధంగా బెట్టింగ్ యాప్ లో యువతతో పాటు కొంత మంది పెద్దలు సైతం పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకొని నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు. బెట్టింగ్ యాప్ లను పురమాయించినా, ప్రోత్సహించినా, ఏదో ఒకచోట ఆడినా, వారిపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. డ్రగ్స్, బెట్టింగ్ ఆప్ లపై సామాజిక దృక్పథంతో పోరాటం చేస్తున్న కార్యకర్తల సమాచారానికి పోలీసు యంత్రాంగం స్పందించాలని సూచించారు.  సెల్ ఫోన్ వాడకం ఇతరత్రా దుష్ప్రభావాలకు కారణం అవుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని పేర్కొన్నారు .

హైకోర్టు అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్యపై సమగ్ర విచారణ...

పెద్దపెల్లి జిల్లా మంథని ప్రాంతంలో హైకోర్టు అడ్వకేట్లు వామన్ రావు(High Court Advocate Vaman Rao) దంపతుల హత్యపై సమగ్ర విచారణ చేపట్టి, హంతకులకు శిక్ష పడేలా చట్టం తన పని తాను చేసుకు పోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నేరం చేయాలనే ఆలోచన ఉన్న నేరస్తుడు ఎవరికి భయపడకుండా నేరం చేస్తా ఉంటారని, అలాంటి వారిని సీసీ కెమెరాలు కట్టడి చేస్తాయని అన్నారు. చట్టంను తన చేతిలో పెట్టుకుని నేరం చేసే క్రమంలో, నేరాలు చేస్తా ఉంటారని, అలాంటి వారిని కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 

ఒకప్పుడు ఈ ప్రాంతంలో నడిరోడ్డు మీద, మిట్ట మధ్యాహ్నం వామన్ రావు దంపతులకు సంబంధించిన హత్య జరిగితే.. ఆ రోజుల్లో చాలామంది తప్పించుకుని పోయిండ్రని, కొంతమంది చట్టానికి చుట్టమై నిలిచిన నేపథ్యంలో.. అసలు వాళ్లు బయటకు వచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. నేరాలను అదుపు చేయాలని, సమాజంలో మార్పు తీసుకురావాలని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఆ పోలీస్ కు .. ఫ్రెండ్ కె ఫ్రెండ్ అని ఉండేదని,  దానిని రూపుమాపి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అందరితో స్నేహపూర్వకంగా, అన్ని వర్గాలకు, సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామని అన్నారు. మంథని నియోజకవర్గంలో అడవులతో పాటు రాష్ట్రాల సరిహద్దులు ఉన్న నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు సునిశి త దృష్టితో వ్యవహరించాలని సూచించారు.

ఏప్రిల్ 13 న శ్రీపాద ఐ హాస్పిటల్ ప్రారంభం...

తన తండ్రి, తమ స్వగ్రామమైన ధన్వాడ నుంచి సర్పంచ్ గా రాజకీయ ఆరంగటం చేసి, అసెంబ్లీ స్పీకర్ స్థాయికి ఎదిగారని, తన తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తానని అన్నారు. నేటికీ ప్రజల మధ్య చిరస్థాయిగా నిలిచిన దుద్దిల్ల శ్రీపాదరావు స్మారకార్థం ఏప్రిల్ 13న శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. వచ్చే నెల 6 నుంచి 13 వరకు ఊరూరా శిబిరాలు నిర్వహించి, అర్హులైన వారికి కంటి పరీక్షలు చేసి, ఉచితంగా అద్దాలతో పాటు శస్త్ర చికిత్సలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కాటారం ప్రాంతంలో స్థలాన్ని ఏర్పాటు చేసుకొని శాశ్వత భవన నిర్మాణం తో ఐ హాస్పిటల్ ను నిర్వహిస్తామని అన్నారు. 

ఉగాది కానుకగా కాటారంకు పరిశ్రమలు...

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ కానుకగా కాటారం ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పబోతున్నామని ఐటి, పరిశ్రమలు మంత్రి శ్రీధర్ బాబు హర్షధనాల మధ్య వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాటారం, మహాదేవపూర్, పలిమల, మహముత్తారం, మల్హర్ మండలాలకు ముఖ్య కూడలిగా ఉన్న కాటారంలో రాబోయే రోజుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.

కాలేశ్వరం నుంచి నగరాలకు వెళుతున్న ఇసుక లారీల వల్ల ఎక్కడ ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీసు యంత్రాంగానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలు ఇచ్చారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని, లారీలకు పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవాలని, మైనింగ్ శాఖ అధికారులతో సమన్వయంగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు . 

న్యాయాన్ని బేరీజు వేసుకోండి

ప్రజలందరూ శాంతి భద్రతల విషయంలో సహకరించాలని, పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వానికి సమన్వయంగా వ్యవహరించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. సమస్యత్మక ప్రాంతమైన నేపథ్యంలో పోలీసులు తమ ఉద్యోగ ధర్మాన్ని కత్తి మీద సాములా పనిచేస్తున్నారని అన్నారు. తాను కానీ ఇంకెవరైనా ఫోన్లు చేసినా...  న్యాయం ఉంటే పని చేయండని సూచించారు. న్యాయాన్ని బేరీజు వేసుకొని నడవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రభాకర్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, కాటారం డి.ఎస్.పి గడ్డం రామ్మోహన్ రెడ్డి, సిఐ ఈఊరి నాగార్జున రావు, సీసీ కెమెరాల నిర్వహణ కమిటీ సభ్యులు కలికోట శ్రీనివాస్, కవ్వాల శేఖర్, ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య రీత్యా హాజరు కాలేక పోయిన ఎస్ ఐ అభినవ్ సేవలను పలువురు గుర్తు చేశారు. నాయకులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోట రాజబాబు గౌడ్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చీమల సందీప్, ఎర్రవెళ్ళి విలాస్ రావు, కొట్టే శ్రీశైలం, జాడి మహేశ్వరి, ఆంగోతు సుగుణ, ఎస్ కె అమీర్, లింగమల్ల దుర్గయ్య, బెల్లంకొండ కిష్టయ్య, ఎనమండ్ర వామన్ రావు, దేవేందర్ రెడ్డి, కొట్టే ప్రభాకర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.