calender_icon.png 7 January, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది

05-01-2025 08:41:31 PM

బౌగోలికంగాను స్పష్టత లోపించింది

సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం స్థానిక మంచికంటి భవన్ లో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్ట పరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన చేయడం వల్ల ఉపయోగంలేదని అభిప్రాయపడ్డారు. పాల్వంచ మున్సిపాలిటీ ఏజెన్సీలో 1/70 పరిదిలో ఉందని ఎన్నికలు జరపడం లేదని చట్ట పరమైన ఈ అంశం పట్ల ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా కార్పొరేషన్ ఏర్పాటు అనేది అసంబద్ధంగా ఉందని అన్నారు. ఇప్పటివరకు ఎన్నికలు జరపని పాల్వంచను కార్పొరేషన్ లో కలపడం వలన ఇప్పటికే పాలకవర్గం ఉన్న కొత్తగూడెం, సుజాత నగర్ లలో ఎన్నికలు జరపకుండా అధికారుల పాలన తీసుకురావడం ప్రభుత్వ ఉద్దేశమా అని ప్రశ్నించారు.

అభివృద్ధి కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లైతే కొత్తగూడెంకి ఇరువైపులా ఉండి అభివృద్ధి చెందుతున్న చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలను వదిలేసి సుజాత నగర్ పాల్వంచ మండలాలు కలపడం బౌగోళికంగా కూడా లోప భూయిస్టంగా ఉందని అన్నారు. ఏజెన్సీ చట్టాల వలన ఈ మండలాలు కలపకపోతే ఏజెన్సీలో 1/70 చట్టం వలన పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు జరపడం లేదని అలాంటపుడు పాల్వంచను కార్పొరేషన్ లో కలపడానికి హేతుబద్ధత ఏంటి అని ప్రశ్నించారు. రూరల్ ప్రాంతంగా ఉన్న సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలు కార్పొరేషన్ లో కలపడం వలన ఉపాధి హామీ పథకం దెబ్బతింటుందని పూర్తిస్థాయి అర్బన్ స్వభావం రాని సుజాత నగర్ మండలాన్ని కార్పొరేషన్ లో కలపడం వలన ప్రజలపై పన్నుల భారం కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించకపోవడం వలన ప్రజలలో అనేక రకాల అనుమానాలకు అవకాశం ఏర్పడుతుందని అందుకని శాస్త్రీయ పద్ధతిలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సూచించారు. లేని పక్షంలో ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రాజకీయ నాయకుల అభివృద్ధి కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు అవుతుందని ఆరోపించారు. కార్పొరేషన్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు సమస్యలు ఏమిటి అని చర్చించడానికి అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలని అందుకు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.బ్రహ్మచారి, లిక్కి బాలరాజు అన్నవరపు సత్యనారాయణ, రేపాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.