calender_icon.png 6 October, 2024 | 4:18 AM

మూడేళ్ల తర్వాత కోర్టు ధిక్కరణ పిటిషనా?

11-09-2024 01:03:30 AM

  1. గణేశ్ నిమజ్జనంపై పిటిషన్ కొట్టివేత  
  2. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా నిమజ్జనం
  3. 2021 నాటి ఉత్తర్వులను అమలు చేయాలి
  4. తేల్చిచెప్పిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ హుస్సేన్‌సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనం వ్యవహారంపై మూడేళ్ల తరువాత దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను అనుమతించలేమని మంగళవారం హైకోర్టు పేర్కొంది. పర్యావరణ పరిరక్షణకు అనువైన విగ్రహాలను మాత్రమే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలని, పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ సరస్సుల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. విగ్రహాల నిమజ్జనంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని తేల్చిచెప్పింది.

హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ, కోర్టు ధిక్కరణ కింద దీన్ని పరిగణించాలంటూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టీ వినోద్‌కుమార్, జస్టిస్ జే అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు వినిపిస్తూ గత ఏడాది హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి 17 క్రేన్లను ఏర్పాటు చేశారన్నారు. భారీ క్రేన్ల వల్ల ట్యాంక్‌బండ్ భద్రతకు ప్రమాదం పొంచి ఉందన్నారు.

ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ మూడేళ్లుగా కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ ఏడాది కూడా 9 నెలలు పూర్తయి పండుగ సమయంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంలో ఉద్దేశం ఏంటని నిలదీసింది. గతంలో కోర్టులు ఆదేశాలిచ్చే నాటికి లేని హైడ్రాను కోర్టు ధిక్కరణ పిటిషన్లో ప్రతివాదిగా ఎలా చేరుస్తారని ప్రశ్నించింది.

పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం లేకపోయినా అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని తెలంగాణ గణేశ్ ముక్తికళాకార్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ఎంవీ దుర్గాప్రసాద్ ధర్మాసనం దృష్టికి తీసుకురావడంతో పీవోపీ విగ్రహాల తయారీపై ఎలాంటి నిషేధం లేదని, కేవలం పీవోపీ విగ్రహాల నిమజ్జనంపైనేనని, ఇందులో జోక్యం చేసుకోవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.