ప్రజల కోసం ఉపాధి, విద్యాహక్కు చట్టాలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: తన పదేళ్ల పాలనా కాలంలో దేశం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం మన్మోహన్ సింగ్ నిరంతరం పాటుపడ్డారు. ఇందుకోసం అనేక చట్టాలు చేశారు. వీటిలోని ముఖ్యమైని దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జీవన భద్రత కల్పించేందుకు ఉపాధి హామీ చట్టం, దేశంలోని పిల్లలకు చదవును ప్రాథమిక హక్కును కల్పిస్తూ చట్టాలు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు నిండిన వారికి జీవన భద్రత కల్పించేందుకు 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరంలో రోజువారీ కూలీతో కూడిన 100 రోజుల పనిదినాలను కచ్చితంగా కల్పిస్తారు. 2005 ఆగస్టులో ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది.
2006 ఫిబ్రవరి నుంచి దశలవారీగా దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. దేశంలోని పిల్లలందరికీ విద్యను ప్రాథమిక హక్కుగా కల్పిస్తూ మన్మోహన్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందిస్తారు. 2009 ఆగస్టు9న ఈ చట్టానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది.