- గోదావరిలో దూకి బలవన్మరణం
- ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): కుటుంబంలో ఇటీవల తలెత్తిన చిన్న చిన్న సమస్యలకు మనస్థాపం చెందిన కానిస్టేబుల్.. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకుంది. పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో క్లూస్ టీమ్‌లో కానిస్టేబుల్‌గా రమణారెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం భద్రాచలం గోదావరి వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఆయన సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
దాని ప్రకారం.. గత కొన్ని రోజుల క్రితం రమణారెడ్డికి రోడ్డు ప్రమా దం జరిగింది. తన తండ్రి కట్టుకున్న ఇంట్లోకి వరద నీరు చేరింది. గత 15రోజులగా రమణారెడ్డి నిద్రకూడా పోకుండా గుబులుగా ఉంటున్నాడు. తన కుటుంబానికి కీడు సంభవించిందనుకున్నాడు. దీంతో బతకడం ఇష్టంలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తాను తీసుకున్న సెల్ఫీ వీడియో లో వెల్లడించాడు. ఆ తర్వాత గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలాన్ని భద్రాచలం సీఐ వై సంజీవరావు, ఎస్సై విజయలక్ష్మి పరిశీలించారు. మృతుడికి భార్య శ్రీలత, కుమారుడు ఉన్నారు.