calender_icon.png 19 March, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకసభ్య కమిషన్ కాదది... ఏకపక్ష కమిషన్

19-03-2025 06:51:37 PM

మాలల అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు వర్గీకరణ కుట్ర...

మాలలు ప్రత్యక్ష,న్యాయ పోరాటాలకు సిద్ధం కావాలి...

జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు... తోటమల్ల రమణమూర్తి..

కొత్తగూడెం (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ చేయడానికి నియమించిన ఏకసభ్య కమిషన్, ఏకసభ్య కమిషన్ కాదని, ఏకపక్ష కమిషన్ అని, మాలల అస్తిత్వాన్ని దెబ్బతీయడానికే ప్రభుత్వం, ప్రతిపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు కుట్రపన్ని ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగానికి విరుద్ధంగా చేశాయని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత చేస్తూ ఆమోదించడాన్ని నిరసిస్తూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్ రావు నాయకత్వంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి  సుమారు రెండు గంటల పాటు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్రావు, జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి మాట్లాడుతూ... బిజెపి పాలిత రాష్ట్రాలలో చేయని ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో మంగళవారం అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తూ ఆమోదించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకొని 2011 కులగణన సర్వే ఆధారం కాకుండా 2024 వరకు కొత్తగా పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకొని ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్ గా మారిందని విమర్శించారు. వర్గీకరణ చేయడం, మాలల్ని అణిసివేయడమే లక్ష్యంగా పాలకులు, పార్టీలు ఒకటయ్యాయని, వర్గీకరణ చేయడంలో శాస్త్రీయత లేదని, శాస్త్రీయత ఉంటే కమిషన్ రిపోర్టును బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మనువాదాన్ని మళ్లీ తెరపైకి తేవడానికి వర్గీకరణ బిల్లు తెచ్చారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై పోరాడడానికి మాలలు ప్రత్యక్ష, న్యాయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి, పాల్వంచ పట్టణ అధ్యక్షులు ధారా చిరంజీవి, జిల్లా మహిళా సంఘం కార్యదర్శి మద్దెటి జయ, నాయకులు జెట్టి మోహన్, కేడం రాము, సల్లం శంకర్, భయాని ఈశ్వరయ్య, పండుగ రాజేశ్వరరావు, పురుషోత్తం, గాదం రాజేందర్, జెట్టి శరత్, వెంకటరత్నం, భరద్వాజ్, టైసన్ శ్రీనివాస్, కనికంట శ్యామ్ కుమార్, గుర్రం లక్ష్మయ్య, బట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.