calender_icon.png 18 January, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంకకు ఓదార్పు విజయం

10-09-2024 03:14:14 AM

  1. మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై  గెలుపు
  2. సెంచరీతో చెలరేగిన నిసాంక

లండన్: ఇంగ్లండ్ చేతిలో ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన శ్రీలంకకు ఓదార్పు విజయం లభించింది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో లంక 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుంది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 40.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి టార్గెట్‌ను ఛేదించి విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (124 బంతుల్లో 127) సెంచరీతో లంకను గెలిపించాడు. కుసాల్ మెండిస్ (39), మాథ్యూస్ (32 నాటౌట్) సహకారం అందించారు. వోక్స్, అకిన్‌సన్ చెరొక వికెట్ తీశారు. నిసాంక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకోగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును రూట్, కమిందు మెండిస్‌లు సంయుక్తంగా దక్కించుకున్నారు.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం లంక బౌలర్ల ధాటికి తడబడింది. కేవలం 156 పరుగులకు ఇన్నింగ్స్ ముగించింది. లాహిరు కుమార 4 వికెట్లు తీయగా.. ఫెర్నాండో 3 వికెట్లు పడగొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 263 పరుగులకు ఆలౌటైంది. మొదటి రెండు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయినా కానీ మూడో టెస్టులో గెలిచి విజయంతో సిరీస్‌ను ముగించింది. డబ్ల్యూటీసీ (2023 పాయింట్ల పట్టికలో శ్రీలంక (7 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు) ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ (16 మ్యాచ్‌ల్లో 8 విజయాలు) ఆరో స్థానంలో కొనసాగుతోంది.