- జార్ఖండ్‌లో హస్తం కూటమి గెలుపు
- విజయంపై టీ కాంగ్రెస్ నేతల్లో సంతోషం
- మహారాష్ట్ర ఫలితాలపై సమీక్షకు సిద్ధం
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): శనివారం వెలువడిన జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలోని అధికార పక్షానికి ఓదా ర్పు విజయంగా మారా యి. తెలంగాణలో తా ము ఇచ్చిన హామీలను నెరవేర్చామని, అందుకే మహారాష్ట్రలోనూ విజయం సాధిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేయగా... జార్ఖండ్‌లో డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క సారథ్యంలో ప్రచారం నిర్వహించారు.
మహారాష్ట్రలో అక్కడి ప్రజలు ఏకపక్షంగా కాంగ్రెస్ మిత్రపక్షాలకు మొండిచేయి చూపించినా... జార్ఖండ్‌లో మాత్రం కాంగ్రెస్ కూటమికి విజయం లభించింది. రెండు చోట్లా కూడా కాంగ్రెస్ పార్టీ 16 చొప్పున సీట్లు సాధించింది. జార్ఖండ్‌లో గెలుపుతో అక్కడ ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణుల్లో సంతోషాన్ని నింపాయి.
ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందని సర్వేలన్నీ తేల్చినా ప్రజలు మాత్రం తమకే పట్టం కట్టడంతో తెలంగాణ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ సరిహద్దు జిల్లాలు, తెలుగు ప్రజలు అధికంగా ఉన్న మహారాష్ట్రంలోని ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేపట్టారు.
హామీలు అమలు చేశామంటూ కోట్లాది రూపాయల ప్రకటనలను మహారాష్ట్ర అంతటా గుప్పించారు. దీంతో తెలంగాణలో మాదిరిగానే మహారాష్ట్రలోనూ విజయం సాధిస్తామని టీ కాంగ్రెస్ నేతలంతా ధీమా వ్యక్తం చేశారు. అయితే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లుగా కాంగ్రెస్‌కు మరాఠా ప్రజలు తలబొప్పి కట్టే ఫలితాన్నిచ్చారు.
మరాఠా తీర్పు ఒక్క మహారాష్ట్ర కాంగ్రెస్‌కే కాకుండా తెలంగాణ కాంగ్రెస్‌కు సైతం శరాఘాతంలా తాకిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలో విజయం సాధించిన తర్వాత ఎంతో ఉత్సాహంగా దేశమంతా ప్రచారం చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి దేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా అడ్డుకుంది.
ఇక రాబోయే రోజులన్నీ తమకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్న తరుణంలో మహారాష్ట్ర ఫలితాలతో కాంగ్రెస్ నేతల్లో నైరాశ్యం కనిపిస్తోంది. మహారాష్ట్రలో 288 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఐదో స్థానంలో నిలిచి కేవలం 16 సీట్లను మాత్రమే సాధించి గతంలో కంటే దారుణమైన ఫలితాలతో పూర్తిగా వెనకబడిపోయింది.
మహారాష్ట్ర గెలుపుతో సత్తా చాటుదామనుకున్నా ఊహించని విధంగా వెనకబడిపోవడం ఆ పార్టీ నేతలకు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ ఫలితాలపై మాట్లా డేందుకు కూడా ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు. అయితే వాయనాడ్‌లో ప్రియాంక గాంధీ భారీ గెలుపు కాంగ్రెస్ నేతలకు ఊరట కలిగించింది.