- వికారాబాద్ జిల్లాలో ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు
- దళారులను ఆశ్రయిస్తున్న రైతులు
వికారాబాద్, అక్టోబర్ 2౬ (విజయక్రాంతి): మొక్కజొన్న సీజన్ ప్రారం భమైనా వికారాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల జాడ లేదు. సీజన్ ప్రారంభమై పదిహేను రోజులకు పైగా కావొస్తున్నా సంబంధిత అధికారులకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సీజన్ ప్రారంభంలోనే కేంద్రాలు ప్రారంభమయ్యేవి. కానీ, ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు అయోమయంలో ఉన్నారు.
51 వేల ఎకరాల్లో సాగు
జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్‌లో 51 వేల ఎకరాలకు పైగా మక్కలు(మొక్కజొన్న) సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సాగు చేసి పంట చేతికొచ్చినా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో మక్క రైతుల్లో ఆందోళన మొదలైంది.
మక్క పంట సేకరణకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని మార్క్‌ఫెడ్ అధికారులు పేర్కొంటు న్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పం టలను అమ్ముకోవడం సమస్యగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మార్కెట్‌కు వస్తున్న మొక్కజొన్న
కొడంగల్, ధారూరు, మర్పల్లి తదితర మార్కెట్లకు ప్రతి వారం 5 వేల నుంచి 8 వేల క్వింటాళ్ల మొక్కజొన్నలు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పక్షం రోజుల క్రితం క్వింటాల్ మక్క ధర రూ.2,200 నుంచి రూ. 2,400 ఉండగా.. ప్రస్తుతం రూ.1,700 నుంచి రూ.2,100 వరకు పడిపోయింది.
ప్రభుత్వ మద్దతు ధర గత సీజన్‌లో రూ. 2,024 ఉండగా ఈ ఏడాది రూ.2,090 గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మద్దతు ధర కొంచెం అటుఇటు ఉన్నప్పటికీ తూకంలో మోసం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. మద్దతు ధర కంటే ఓపెన్ మార్కెట్‌లో ధరలు పతనమవుతుండటంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సంవత్సరం జిల్లాలో 51 వేల ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేయగా.. ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు చేశా రు. ఇంత పెద్ద మొత్తంలో సాగైన మక్కను ప్రైవేటు వ్యక్తులే కొనుగోలు చేయాల్సి వస్తే రైతులకు తీవ్ర నష్టం జరగనుంది.
దక్కని మద్దతు
ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడం వలన మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. దీంతో రైతులకు నష్టం జరుగుతోంది. ప్రభుత్వం రూ.2,090 మద్దతు ధర నిర్ణయించగా, ప్రస్తుతం జిల్లాకు చెందిన వ్యవసాయ మార్కెట్‌లో తేమ తదితర కారణాలు చూపి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ తూకంలో మోసం చేస్తున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు.
దీంతో మక్కలు ఎక్కడ విక్రయించుకోవాలో తెలియక దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు చెప్పిందే ధర, ఇచ్చిందే మద్దతు అన్న తరహాలో దళారీ పనితనాన్ని రైతుల నెత్తిన రుద్దుతున్నారు.