03-03-2025 12:25:26 AM
అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ
మంచిర్యాలలో ముగిసిన బర్డ్స్ ఫెస్టివల్
మంచిర్యాల, మార్చి 2 (విజయక్రాంతి) : పర్యావరణంలో మిగిలిన జీవరాశుల కంటే ఎంతో జీవ వైవిధ్యం కలిగిన పక్షుల సంరక్షణపై సమగ్ర అధ్యయనం జరగాలని, ఇందుకు దీర్ఘకాలిక పరిశీలన అవసరమని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (కంపా ) డాక్టర్ సువర్ణ అన్నారు. అటవీ శాఖ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో మంచిర్యాలలో రెండు రోజులుగా జరిగిన బర్డ్స్ ఫెస్టివల్ ఆదివారంతో అట్టహాసంగా ముగిసింది.
ఈ సందర్భంగా మంచిర్యాలలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పక్షుల గమనానికి పరిధులు లేవని, అవి ఖండాలు దాటి ప్రయాణిస్తూ పర్యావరణంలో కీలకపాత్ర వహిస్తున్నాయన్నారు. పర్యావరణంలో జరిగే పెను మార్పుల వల్ల కొన్ని జాతుల పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వలస వెళ్తుంటాయని, ఇలాంటి పక్షులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పక్షులు ఎంతో జీవవైవిద్యం ప్రదర్శిస్తూ మానవాళి మనుగడకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయన్నారు.
జిల్లాలో వేల సంఖ్యలో పక్షులు: శివ్ ఆశిష్ సింగ్, జిల్లా అటవీ శాఖ అధికారి
జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎన్నో వేల రకాల పక్షులు సంచరిస్తున్నాయని మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ అన్నారు. రెండు సంవత్సరాలుగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ సహకారంతో జన్నారం అటవీ డివిజన్ లో దీర్ఘకాలిక పరిశీలన చేసి 201 జాతుల పక్షులను గుర్తించామన్నారు. జిల్లా పరిధిలోని మిగిలిన అటవీ డివిజన్ లలో కూడా అటవీ సిబ్బంది తమ పరిధులలో పక్షుల గమనాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రికార్డు చేసుకోవాలని సూచించారు.
అనంతరం కొమురం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్ టిబ్రేవాల్, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ శాస్త్రవేత్త మహేష్ శంకరన్, తమిళనాడుకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ విజయన్, శాస్త్రవేత్త డాక్టర్ సాథియా సెల్వం మాట్లాడారు. ఈ బర్డ్స్ ఫెస్టివల్ సందర్భంగా పక్షుల సంరక్షణలో సేవలందిస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు సభ్యులకు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ, కవ్వాల్ టైగర్ రిజర్వ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతా రాములు కలిసి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ప్రధాన అధికారి బండి రాజశేఖర్, అదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ కుమార్ పాటిల్, మంచిర్యాల ఫారెస్ట్ డివిజనల్ అధికారి సర్వేశ్వరరావు, పక్షులపై అధ్యయనం చేస్తున్న ప్రముఖులు డాక్టర్ శాంతారామ్, డాక్టర్ బిక్షం గుజ్జ, డాక్టర్ సాథియా సెల్వం, సంజీవ్ మీనన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఫారెస్ట్ రేంజ్ అధికారులు, డిప్యూటీ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.