మున్సిపల్ ఆస్తులు అమ్మిన వారిపై సమగ్ర విచారణ జరిపించాలి
కలెక్టర్కు, ఎస్పీకి, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్‌లకు ఫిర్యాదు
విచారణ చేసి బాధ్యులను
కఠినంగా శిక్షించాలని వినతి
కామారెడ్డి మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యుల వినతి
కామారెడ్డి, జూన్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపాలిటీలో రూ.90 లక్షలకు పైగా ప్రభుత్వ ఆస్తుల అక్రమ విక్రయం..? పై జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులను అరెస్ట్ చేయాలని కౌన్సిలర్ కళ్లెం సావిత్రి సత్యం తోపాటు 19 మంది కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు మంగళవారం, జిల్లా కలెక్టర్ కు జిల్లా ఎస్పీ, ఆర్డీవో ఇంచార్జ్ (అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్), మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కామారెడ్డి మున్సిపాలిటీకి చెందిన ప్రభుత్వ ఆస్తులు, స్క్రాప్ సామగ్రి, కాపర్ వస్తువులు, పాత మోటార్లు, ఇతర విలువైన 90 లక్షల విలువచేసే సామగ్రిని అక్రమంగా తరలించి విక్రయించడం ద్వారా రూ.90 లక్షలకు పైగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని 20వ వార్డు కౌన్సిలర్ కళ్లెం సావిత్రి సత్యం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు, ఎస్పీ లకులకు సమర్పించిన వినతి పత్రంలో వారు కోరారు.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వాటర్ ఫిల్టర్ బెడ్ గోదాం, బుర్ర మత్తడి, పెద్ద చెరువు ప్రాంతం, వాటర్ బెడ్ ట్యాంక్ సమీప ప్రాంతాలు, జాతీయ రహదారి పక్కన నిల్వ ఉంచిన స్క్రాప్ సామగ్రి, కాపర్ వస్తువులు, పాత మోటార్లు తదితర విలువైన ప్రభుత్వ ఆస్తులను 2024 డిసెంబర్ 10వ తేదీ రాత్రి కొందరు వ్యక్తులు కూలీల సహాయంతో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా తరలించినట్లు స్థానికంగా సమాచారం వెలుగులోకి వచ్చిందని ఆమె తెలిపారు.
ఈ ఘటనపై ఇప్పటికే 2024 డిసెంబర్ 15న మున్సిపల్ కౌన్సిలర్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, డిసెంబర్ 16న మున్సిపల్ కమిషనర్కు, డిసెంబర్ 21న జిల్లా కలెక్టర్కు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియజేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం పత్రికల్లో ప్రచురితమైన కథనాలు, స్థానికంగా సేకరించిన సమాచారం, అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో నిల్వ ఉంచిన స్క్రాప్, ఇతర విలువైన సామగ్రిని కూడా అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. వాటర్ ఫిల్టర్ బెడ్ వద్ద విధులు నిర్వహించిన వాటర్ వరక్స్ ఉద్యోగి శ్యామ్ ఇచ్చిన వాంగ్మూలంలో కూడా సంబంధిత వ్యక్తుల సమక్షంలోనే సామగ్రి తరలింపు జరిగినట్లు వెల్లడించారని తెలిపారు.
ప్రజల పన్నుల రూపంలో సమకూరిన నిధులతో కొనుగోలు చేసిన ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా విక్రయించడం అత్యంత తీవ్రమైన అవినీతి చర్యగా పరిగణించి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి అన్నారు. మున్సిపాలిటీకి చెందిన స్క్రాప్, కాపర్, మోటార్లు మరియు ఇతర సామగ్రిపై పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలి. గతంలో సమర్పించిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికను బహిర్గతం చేయాలి.
అక్రమంగా తరలించబడిన ప్రభుత్వ ఆస్తులను గుర్తించి రికవరీ చేయాలి. బాధ్యులుగా తేలిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం, అక్రమ విక్రయం, నిధుల నష్టానికి కారణమైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఫిర్యాదుతో పాటు సంబంధిత వీడియోలు, పత్రికా కథనాలు, గతంలో సమర్పించిన ఫిర్యాదుల ప్రతులను జిల్లా అధికారులకు అందజేసినట్లు వారు తెలిపారు.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి పారదర్శక విచారణ చేపట్టాలని, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కౌన్సిలర్లు హెచ్చరించారు.
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అంజద్, లడ్డు, కాళ్ల రాజమణి, వనిత రామ్మోహన్, ఫాతిమా, గ్యార అఖిల, నీట్టు గంగాధర్ రావు. గోనె సునీత, తహసీన్ ఉన్నిసా, వాజి ద్, ఆఫ్రిన్ సుల్తానా, ఆస్మా హబీబ్ ఖానం, సుల్తానా బేగం, కొత్తపల్లి లలిత, మహమ్మద్ ఇసాక్ షేరు, అన్వర్ అహ్మద్, గోన శ్రీనివాస్, ముబాషిర్, కాళ్ళ గణేష్, మాజీద్, కళ్లెం సత్యం, రామ్మోహన్, గ్యార సాయిలు, అస్రార్,జావిద్, మోతిలాల్ నాయక్, సునీత, పహిన్ సుల్తానా,17 మంది వార్డు కౌన్సిలర్లు, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






