calender_icon.png 6 November, 2024 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

06-11-2024 04:53:10 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో భాగంగా జిల్లాలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో  సర్వేను జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్యునరేటర్ సేకరిస్తున్న వివరాలను పరిశీలించారు, అనంతరం సర్వే చేసిన ఇంటికి స్టికర్ ను అంటించారు. అనంతరం సర్వేలో తీసుకోవలసిన జాగ్రత్తలు చేపట్టవలసిన చర్యలపై ఎమ్యునరేటర్ కు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైందని అన్నారు.

జిల్లాలో మొత్తం 2761 ఏమ్యూనరేషన్  బ్లాక్ లు ఉన్నాయని, అన్ని బ్లాక్ లకు అమ్యూనరైటర్లను నియమించామన్నారు. ఒక్కో ఇమ్యునరేటర్ కి 150 గృహాలను కేటాయించామన్నారు. రానున్న మూడు రోజులు ఇంటి గుర్తింపు కార్యక్రమం చేపడతామని, గుర్తింపు చేసిన గృహాలకు స్టిక్కర్లు అందించడం జరుగుతుందని తెలిపారు. సర్వేలో భాగంగా ప్రజలు ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేయాలని దాని ద్వారా  రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతులు, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కొరకై వివిధ సామాజిక, ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరచడానికి తగిన ప్రణాళికలు తయారు చేయడం, వాటిని అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

దీనిలో భాగంగా ప్రతి ఎమ్యునరేటర్ ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎంతమంది ఉంటారు, వారి యొక్క ఆదాయ వివరాలు, ఎవరైనా విదేశాలలో ఉన్నారా, ప్రజా ప్రతినిధులుగా ఎవరైనా ఉన్నారా, వారి యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు వివరాలు వంటి 75 ప్రశ్నలకు వివరాలు సేకరిస్తున్నారన్నారు. ప్రజలు అందరూ ఇంటింటి సర్వేలో పాల్గొనాలని సూచించారు. సర్వేలో భాగంగా ఫారం నింపే సమయంలో ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ వంటి పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన స్వామి, సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.