calender_icon.png 17 October, 2024 | 12:20 AM

సంపూర్ణంగా కాలేజీల బంద్

16-10-2024 02:27:43 AM

ముందస్తు పెండింగ్ టోకెన్లు క్లియర్ చేయాల్సిందే

ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘాల డిమాండ్

నేడు లేదా రేపు యాజమాన్యాలతో సర్కారు చర్చలు!

వన్‌టైం సెటిల్‌మెంట్‌కు యాజమాన్యాల సానుకూలం

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.5,900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం తలపెట్టిన డిగ్రీ, పీజీ కాలేజీల బంద్ విజయవంతమైందని యాజమాన్యాలు తెలిపాయి.

జిల్లాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించినట్లు  తెలిపారు. బంద్‌కు సంబంధించి ముందస్తు సమాచారమివ్వడంతో విద్యార్థులెవరూ తరగతులకు హాజరుకాలేదు. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం సమాచారం అందక కాలేజీలకు వచ్చిన విద్యార్థులు వెనుదిరిగి వెళ్లారు.

విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు జిల్లా కేంద్రా ల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, బీసీ, ఇతర విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీ నేతలు మద్దతు తెలిపారు. మరోవైపు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు మాత్రం తమకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ముందుగా పెండింగ్ టోకెన్లలో తమకు రావాల్సిన రూ.650 కోట్లునా క్లియర్ చేస్తే బంద్‌ను విరమించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. మిగతా బకాయిలను తర్వాత సర్దుబాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

వన్‌టైమ్ సెటిల్‌మెంట్ యోచనలో సర్కార్!

గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా పెండింగ్ బకాయిలను వన్‌టైం సెటిల్‌మెంట్ చేసే దిశగా సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌పై నిర్ధిష్టమైన గడువు విధించి సీఎం హామీ ఇస్తే బంద్‌ను విరమించుకునే అంశాన్ని పరిశీలిస్తామని కళాశాల యాజమాన్య వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌పై ప్రభుత్వ పెద్దలు ఆరా తీసినట్లు తెలిసింది. యూనియన్ నాయకులతో నేడు లేదా రేపు సమావేశమై ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై చర్చించనున్నారు. ఫీజు బకాయిల అంశాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకెళ్లినట్లు సమాచారం.

ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించకుంటే తాము స్పందించాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. ఈక్రమంలోనే బుధవారం లేదా గురువారం ప్రైవేట్ యాజమాన్యాలతో చర్చలు జరిపే అవకాశం ఉందని ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం నాయకులు తెలిపారు.