calender_icon.png 16 January, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుజ్జి కడుపు తీయగా!

29-10-2024 12:00:00 AM

పండుగ అనగానే పిల్లలకు టక్కున గుర్తొచ్చేది.. స్వీట్ ఐటమ్స్.. కొత్త బట్టలు.. ఇంటి తోరణాలు.. అతిథిలు.. స్నేహితులు. పండుగ పూట.. కడుపుకు చల్లగా, పసందుగా ఉండే కమ్మటి పాయసాలను పిల్లలకు చేసి పెడితే లొట్టలేసుకుంటూ తాగేస్తారు. మరెందుకు ఆలస్యం.. కింది వాటిలో మీకిష్టమైన వాటిని ఓసారి ట్రై చేసి చూడండి!

సేమ్యా పాయసం..

సేమ్యా పాయసాన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా నెయ్యిలో బాదం, పిస్తా, ఎండుద్రాక్ష, జీడిపప్పును దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే పాత్రలో సేమ్యాను లైట్‌గా వేయించుకోవాలి. స్టవ్ పై మరో పాత్రలో పాలను బాగా మరిగించుకోవాలి.

పాలు బాగా మరిగాక దాంట్లో చక్కెర వేసి మరో రెండు నిమిషాలు మరిగించాలి. తర్వాత ముందుగా వేయించుకున్న సేమ్యా దాంట్లో వేసి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉడించుకోవాలి. చివరగా డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. 

సగ్గుబియ్యంతో..

ముందుగా సగ్గుబియ్యాన్ని గంటపాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాత్ర పెట్టి అందులో పెసరపప్పు వేసి నూనె లేకుండా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పును రెండుసార్లు నీటిలో శుభ్రపరచుకొని తర్వాత కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరో పాత్రలో రెండు కప్పుల నీళ్లు, నెయ్యి వేసి వేడి మరిగించుకోవాలి.

నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి తక్కువ మంట మీద బాగా ఉడికించాలి. దాంట్లోనే మెత్తగా ఉడికించుకున్న పెసర పప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే నెయ్యిలో వెయించిన జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్షను పాయసం చల్లారక గార్నిష్ చేసుకోవాలి. చివరిగా సువాసన కోసం యాలకుల పొడిని కలుపుకోవాలి. దీన్ని పిల్లలు ఇష్టంగా తాగేస్తారు. 

సజ్జలతో.. 

సజ్జలను రెండు నిమిషాలపాటు సన్నని మంటపై వేయించి బాగా కడిగి గంటసేపు నానబెట్టాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేడయ్యాక బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. సేమ్యా కూడా వేయించి పెట్టుకోవాలి. అదే కడాయిలో పాలుపోసి బాగా మరుగుతున్న దశలో.. నానబెట్టిన సజ్జలు జోడించి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత సేమ్యా, తరిగిన బెల్లం వేసి కలుపుతూ మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరిగా యాలకులపొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుంటే సజ్జల పాయసం సిద్ధం. 

శనగపప్పుతో..

శనగపప్పును కడిగి పది నిమిషాలు నానబెట్టిన తర్వాత రెండింతలు నీటిలో పోసి ప్రెషర్ కుక్కర్‌లో నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పాలను మరిగించి పక్కన ఉంచాలి. కుక్కర్ వేడి తగ్గిన తర్వాత శనగపప్పును ఒక మోస్తరుగా మెదపాలి. వెడల్పాటి పాత్ర పెట్టి అందులో మెదిపిన శనగపప్పు వేసి పాలు పోసి కలుపుతూ మరిగించాలి. ఈ మిశ్రమంలో బుడగలు వచ్చేటప్పుడు బెల్లం తురుము, యాలకుల పొడి వేసి సన్నటి మంట మీద కలుపుతూ ఉడికించాలి. మరొక స్టవ్ మీద నెయ్యిలో జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ వేయించాలి. వీటిని ఉడుకుతున్న పాయసంలో వేసి కలిపి దించేయాలి.