పరిశ్రమ వర్గాల ప్రశంసలు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై పరిశ్రమ వర్గాలనుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాన్యుడి ప్రయోజనాలపై దృష్టిపెడుతూనే ఆర్థిక లోటును పూడ్చడానికి ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రయత్నించారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అయితే దేశీయ పెట్టుబడిదారులకు మరింత వెసులుబాటు కల్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ‘వ్యవసాయ రంగంలో పాటుగా గృహనిర్మాణం, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం ఆశాజనకం. మొత్తంగా సూక్ష్మదేశీయ పెట్టుబడులకు ఇది మంచి బడ్జెట్. దేశీయ పెట్టుబడిదారులకోసం మెరుగైన చర్యలు తీసుకోవాల్సింది’ అని హిందుజా గ్రూపు చైర్మన్ అశోక్ హిందుజా పేర్కొన్నారు. ‘ అనుభవజ్ఞుడైన కెప్టెన్ నాయకత్వంలో ఎంతో పరిశోధించి, వివరణాత్మక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు’ అని తాజా బడ్జెట్‌ను క్రికెట్ జట్టుతో పోలుస్తూ ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయంకా ప్రశంసించారు.
సామాన్యుడి ప్రయోజనాలపై దృష్టిపెట్టారని కొనియాడారు. ప్రజాకర్షక పథకాలు, విధానపర చర్యల మధ్య సమతూకం పాటించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్ రాజగోపాలన్ అన్నారు. రైతలుకు ఆర్థిక మద్దతు, వ్యక్తిగత ఆదాయపన్నులో మినహాయింప పరిమితులు, స్టాండర్డ్ డిడక్షన్‌లను పెంచడం వంటి చర్యలు సానుకూల పరిణామమన్నారు. మరోవైపు తాజా బడ్జెట్‌పై ఆతిథ్య రంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో సవాళ్లను అధిగమించడానికి నిర్మాణాత్మక మార్పులు తెచ్చేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని వ్యాఖ్యానించింది.