జీఎస్టీ కౌన్సిల్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): డెలివరీ సేవల పన్ను రేట్లను సమగ్రంగా పరిశీలించేందుకు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. శనివారం రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రానికి భట్టి కొన్ని కీలక ప్రతిపాదలను చేయగా.. పలు అంశాలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
ఏవియేషన్ టర్బున్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై జరిగిన చర్చలో భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏటీఎఫ్‌ను ప్రస్తుతం ఉన్న రాష్ర్ట వ్యాట్ పరిధిలోనే ఉంచాలని ప్రతిపాదించారు. రాష్ట్రాలకు తక్కువ ఆదాయ వనరులు ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు చెప్పారు. 2019లో ఏర్పాటైన జీఎస్టీ ఆదాయ విశ్లేషణపై ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ను కొనసాగించాలని సూచించారు.
2015 ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా కేటాయించిన ఐజీఎస్టీ పునరుద్ధరణ విషయంలో న్యాయబద్ధమైన విధానం అనుసరించాలన్నారు. వరదల వల్ల జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని సెస్‌లో వెసులుబాటు కల్పించాలని భట్టి కోరారు. ఈ అంశాన్ని జీవోఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)కు అప్పగించేందుకు మండలి ఆమోదం తెలిపింది. సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.