స్మారక నాణెం అనేది ఒక ప్రత్యేక రకం నాణెం. ఇవి సాధారణంగా ముఖ్యమైన చారిత్రక వార్షికోత్సవాలు, జాతీయ వేడుకలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక పండుగలు లేదా రాజకీయ నాయకులు, కళాకారులు లేదా శాస్త్రవేత్తలు వంటి ప్రముఖ వ్యక్తులను గౌరవించడానికి సృష్టించబడతాయి. ఈ నాణేలను ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, నోయిడాలో ఉన్న నాలుగు భారత ప్రభు త్వ మింట్‌లలో ఉత్పత్తి చేస్తారు. ఇవి సాధారణంగా పరిమిత పరిమాణంలో ఉత్పత్తి చేయబడతాయి. ప్రముఖ నటుడు, స్టూడియో నిర్మాత, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత అక్కినేని ఎన్నో చిత్రాలలో విభిన్న పాత్రల్లో నటించి తెలుగు చిత్ర రంగానికి వన్నె తెచ్చిన నటుడు.
ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం, ఆయన నటించిన కొన్ని చిత్రాలు ప్రదర్శించడం మంచి పరిణామం. ఎంతోమంది స్వాతం త్ర యోధులు, మహా పురుషులు, చిత్ర రంగ ప్రముఖుల ముఖ చిత్రాలతోకూడిన నాణేలను కేంద్రం ముద్రించింది. గతంలో నందమూరి తారక రామారావు స్మారక నాణెం విడుదల చేయడంతో అభిమానులు తండోపతండాలుగా వచ్చి కొనుగోలు చేయడం జరిగింది. కావున కేంద్రం అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి పురస్కరించుకొని ఆయన స్మారక నాణెం విడుదల చేయాలి. దీని వలన అక్కినేనికి ఘన నివాళులు అర్పించినట్లు అవుతుంది.
ఆళవందార్ వేణు మాధవ్, హైదరాబాద్