హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి బీ ఆర్యన్ రోషన్ ఎంతో కష్టపడి చదివి ఐఐటీ తిరుపతిలో సీటు దక్కించుకున్నాడు. అయితే, ఐఐటీలో చేరేందుకు అతనికి పేదరికం అడ్డు వచ్చింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ఆ విద్యార్థి చదువుకునేందుకు తోడ్పాటునందించారు. రూ. 40,500 విలువ చేసే ల్యాప్‌టాప్‌తో పాటు ఐఐటీ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు రూ.36,750 చెక్కును అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్యన్ రోషన్ ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.