calender_icon.png 26 November, 2024 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలుతున్న పేదల గూడు

27-09-2024 02:49:49 AM

శిథిలావస్థలో వాంబే ఇళ్లు

ఆందోళనలో నివాసితులు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

చార్మినార్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల్లు కట్టించి ఇచ్చినప్పటికీ వాటి మరమ్మతులను మాత్రం ఎవరూ పట్టించుకోరు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జంగమ్మెట్ డివిజన్ రవీంద్రనాయక్ నగర్‌లో జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం వాంబే కాలనీలో 800 గజాల ప్రభుత్వ స్థలంలో 36 మంది లబ్ధిదారులకు వాంబే ఇళ్లను నిర్మించి ఇచ్చారు.

అయితే నివాస భవన సముదాయానికి కనీసం ప్లాస్టింగ్ చేయకుండా, విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు వంటివి కల్పించకుండానే హడావిడిగా లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఇళ్లను కేటాయించి నేటికి పదిహే నేళ్లు అవుతున్నప్పటికీ వాటి మరమ్మతుల విషయమై ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకొని ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఎప్పుడు ఏ ఇంటి పైకప్పు కూలిపోతుందో తెలియక అందు లో నివాసం ఉంటున్న పేదలు ఆందోళన చెందుతున్నారు.

పట్టించుకోని అధికారులు..

మొత్తం 800 గజాల స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో 12 ఇళ్ల్లు, మొదటి అంతస్తులో 12 ఇళ్లు, రెండో అంతస్థులో మరో 12 ఇళ్లను అపార్ట్‌మెంట్ పద్ధతిలో నిర్మించారు. మొత్తం 36 ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించారు. అయితే ఈ పదిహేను ఏళ్లలో రెండో అంతస్తులో పేదలకు కేటాయించిన 12 ఇళ్లు శిథిలావస్థకు చేరుకొని సగభాగానికి పైగా పైకప్పులు కూలిపోయాయి. దీంతో రెండో అంతస్తులో నివసించే 12 కుటుంబాలు ఇళ్ల ను ఖాళీ చేసి ప్రస్తుతం కిరాయి ఇళ్లలో ఉం టున్నారు. అలాగే గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉం డే ఇళ్లుకూడా ఎప్పుడైనా కూలిపోయే ప్ర మాదం ఉందని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నట్లు అందులో ఉండే నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందిం చి మరమ్మతులు చేపట్టాలని నివాసితులు కోరుతున్నారు. 

రూ.100 కోట్లు ఏమైనట్లు..?

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా జేఎన్‌ఎన్‌యుఆర్‌యం, వాంబే ఇండ్ల మరమ్మతుల కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జంగమ్మెట్ డివిజన్ రవీంద్రనాయక్‌నగర్‌తో పాటు బండ్లగూడ ప్రాంతంలో నిర్మించిన వాంబే ఇళ్లకు కూడా ఈ నిధులతో మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అయినప్పటికీ తదనంతరం ఇళ్ల మరమ్మతులు మాత్రం చేపట్టకుండా ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మకై నిథులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పైకప్పు కూలిపోతోంది

కష్టం చేసుకొని బతికేటోళ్లం. ఎక్కడికి పోవాలో తెలి యడం లేదు. సర్కార్ ఇల్లు ఇచ్చిందని సంతోషపడ్డాం. అయితే ఇప్పటివరకు ఇళ్ల బాగుకోసం ఏవరూ పట్టించుకోలేదు. రోజురోజుకు ఇళ్ల పైకప్పు కూలిపోతోంది. పై అంతస్తులో నివసించే వారు అంద రూ ఖాళీ చేసి కిరాయి ఇళ్లలోకి వెళ్లిపోయారు. ఇంట్లో ఉండాలంటే భయం వేస్తోంది.

 వి.సక్రి, 

వాంబే కాలనీ నివాసి

కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పు డు వాంబే ఇళ్లను కేటాయించారు. ఆ తరువాత ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా వదిలేశారు. మరమ్మతులు చేపట్టాలని నాలుగేళ్ల్లుగా అధికారుల దృష్టికి తీసుకుపోతున్నప్పటికీ ఎవరూ స్పందించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి శిథిలావస్థలో ఉన్న భవనం కూల్చివేసి కొత్తగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. 

 కృష్ణ నాయక్,  స్థానికుడు

చాంద్రాయణగుట్ట

ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం

వాంబే కాలనీ ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని మా దృష్టికి వచ్చింది. ఈవిషయమై పూర్తి సమాచారంతో కలెక్టర్‌కు నివేదిక అందజేశాం. వాంబే కాలనీలోని ఇళ్లను కూల్చివేయాలా లేక మరమ్మతులు చేపట్టాలా అనేది ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు. ఇళ్లలో నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలి.

 రాధిక, డిప్యూటీ తహసీల్దార్, బండ్లగూడ