calender_icon.png 4 March, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంలో మిర్చిబోర్డును ఏర్పాటు చేయాలి

04-03-2025 12:15:51 AM

మిర్చిని ఆహార పంటగా గుర్తించాలి

అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన

ఖమ్మం, మార్చి 3 ( విజయక్రాంతి ): ఖమ్మంలో మిర్చిబోర్డును ఏర్పాటు చేసి క్వింటా ఒక్కింటికి రూ.25వేల చొప్పున కొనుగోలు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో రాను రాను ధరను తగ్గిస్తున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. సోమవారం సిపిఐ, సిపిఎం, బిఆర్‌ఎస్, మాస్లున్ పార్టీలు అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ పక్షాల నేతలు మాట్లాడుతూ ఖమ్మంలో ప్రధాన పంటల్లో మిర్చి కూడా ఒకటని ఈ ఏడాది అననుకూల వాతావరణ పరిస్థితులు ఇతరత్రా కారణాలతో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. గతేడాది ఇదే సమయంలో క్వింటా రూ. 20వేలకు విక్రయించిన మిర్చి ఇప్పుడు కేవలం రూ.12 వేల నుంచి రూ.13వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని నేతలు ఆరోపించారు. ఖమ్మంలో మిర్చి సాగుకు అనుకూలంగా మిర్చిబోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

క్వింటా రూ.25వేల చొప్పున కొనుగోలు చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని నేతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ర్ట అధ్యక్షులు బాగం హేమంతరావు మాట్లాడుతూ మిర్చి పంటను ఆహార పంటల జాబితాలో చేర్చి మద్దతు ధరల నిర్ణయాక కమిటీ ద్వారా ప్రతి ఏడాది మిర్చి పంటకు గిట్టుబాటు ధర లభించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ పక్షాల నేతలు తాతా మధు, సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, బానోత్ చంద్రావతి, పోతినేని సుదర్శన్రావు, దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, అడపా రామకోటయ్య, బొంతు రాంబాబు, మాదినేని రమేష్, ఆవుల వెంకటేశ్వర్లు, పుచ్చకాయల సుధాకర్, బాగం ప్రసాద్ రైతులు తదితరులు పాల్గొన్నారు.