calender_icon.png 15 March, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారిన శ్రీలంక

18-12-2024 12:00:00 AM

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం న్యూఢిల్లీ వచ్చారు. సాధారణంగా అయితే మన పొరుగుదేశమైన శ్రీలంక అధ్యక్షుడు భారత్‌లో పర్యటించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఆ దేశంలో మారిన రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దిసనాయకే పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గత సెప్టెంబర్‌లో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దిసనాయకే తన తొలి విదేశీ పర్యటనకు భారత్‌ను ఎంపిక చేసుకోవ డమే దీనికి కారణం.

కరుడుగట్టిన మార్క్సిస్టువాద పార్టీ  జనతా విముక్తి పెరుమన( జేవీపీ)లో కీలక నాయకుడయిన దిసనాయకే మొదటినుంచి తమ దేశ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకి స్తూ వస్తున్నారు. ముఖ్యంగా 1987 1989 మధ్య కాలంలో కుదిరిన భారత్‌శ్రీలంక శాంతి ఒప్పందాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు జేవీపీ నేతృత్వంలోని ఎన్‌పీపీ ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి దిసనాయకే అధ్యక్ష పగ్గాలు చేపట్టారు.

రెండేళ్ల క్రితం శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోవ డం, ఫలితంగా అప్పటి అధ్యక్షుడు రాజపక్స పదవీచ్యుతుడు కావడం తెలిసిందే. తర్వాత జరిగిన  ఎన్నికల్లో దిసనాయకే తిరుగులేని మెజారిటీతో విజయం సాధించి జనం మెచ్చిన నాయకుడిగా నిలిచారు. కాగా పదినెలల క్రితం జేవీపీ ప్రతినిధుల బృందంలో సభ్యుడిగా దిసనాయకే మన దేశంలో తొలిసారి పర్యటించినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి.

అప్పటికి శ్రీలంకలో ఎన్నికల తేదీ కూడా ప్రకటించ లేదు. కానీ అక్కడ మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా దిసనాయకే విజయం సాధించే అవకాశాలున్నాయని భారత్‌కు స్పష్టంగా తెలుసు.  అంతేకాదు శ్రీలంకలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంతో తన సంబంధాలను బలోపేతం చేసుకోవడం వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో అవసరం కూడా. అందుకే మన దేశం కూడా  అక్కడ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో భారీగానే పెట్టుబడులు పెట్టింది. అలాగే ఆర్థిక సంక్షోభ సమయంలో  ఉదారంగా ఆర్థిక సాయం అందించడం ద్వారా శ్రీలంకను ఆదుకొంది. 

వీటన్నిటినీ దిసనాయకే ప్రభుత్వం మరిచిపోలేదనడానికి ఆయన తన తొలి విదేశీ పర్యటనకు భారత్‌ను ఎంపిక చేసుకోవడమే నిదర్శనం. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో చర్చల అనంతరం దిసనాయకే భారత్ ప్రయోజనాలకు భంగం కలిగించేలా తమ భూభాగాన్ని ఇతరులు వినియోగించుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించబోమని స్పష్టం చేశారు.  శ్రీంకలోని హంబన్ తోట పోర్టు లక్ష్యంగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టేందుకు చైనా ప్రయత్నిస్తోందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో దిసనాయకే ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

అంతేకాకుండా భారత్‌తో త్వరలోనే రక్షణ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకో బోతున్నట్లు కూడా ప్రకటించారు. కాగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంనుంచి బయటపడి స్థిరత్వం సాధించేదాకా ఆ దేశానికి తమ మద్దతు కొనసాగుతుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. భారత జాలర్ల సమస్య విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఇరు దేశాల నేతలు అంగీకరించినట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. 

కాగా దిసనాయకే పర్యటన ప్రారంభానికి ముందు కొలంబో రేవు అభివృద్ధికి అదానీ గ్రూపుతో కుదుర్చుకొన్న ఒప్పందాన్ని కొనసాగిస్తామని శ్రీలంక ప్రకటించడం గమనార్హం.  లంచాల ఆరోపణలపై అదానీ గ్రూపు పై అమెరికాలో కేసు నమోదయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై పునరాలోచిస్తామని అంతకుముందు శ్రీలంక ప్రకటించింది. మొత్తంమీద దిసనాయ కే పర్యటన ఇరుదేశాల మధ్య అపోహలు తొలగిపోయి సంబంధాలు బలోపేతం కావడానికి మార్గాన్ని సుగమం చేసిందనే చెప్పాలి.