calender_icon.png 27 April, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్యాల నగరంలో.. అందాల వేడుక!

27-04-2025 12:00:00 AM

మిస్ వరల్డ్ 2025 పోటీలు మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. ప్రపంచ సుందరీమణులకు స్వాగతం పలకడానికి ముస్తాబవుతోంది. ఈ వేడుకలో దాదాపు 140 దేశాలకు చెందిన వారు పాల్గొననున్నారు. మూడు వేలమంది ప్రపంచ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ పోటీలను నిర్వహించడానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది  ప్రభుత్వం.  

అందం కేవలం శరీరాకృతి, సౌందర్య ప్రదర్శనకు మాత్రమే కాకుండా బహుమఖ ప్రజ్ఞా విశేషాలకు రూపాంతరం చెందడం విశేషం. ఈసారి మిస్ వరల్డ్ పోటీలు ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే లక్ష్యంతో ఒక అడుగు ముందుకు వేసి సౌందర్యానికి, సామాజిక ప్రయోజనానికి వారధిని నిర్మించాయి. ఈ నేపథ్యంలో ఒకనాడు వజ్రాలకు, ముత్యాలకు పేరుగాంచిన నగరంలో అందాల పోటీలకు వేదిక కాబోతున్నది. ఈ సందర్భంగా ఆ విశ్వ వేడుక గురించి భిన్న స్వరాల మనోభావాలను తెలుసుకుందాం.. 

సంస్కృతి ప్రతిబింబించేలా.. 

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా పోటీలు నిర్వహిస్తాం. హైదరాబాద్‌లోనే కాకుండా రామప్ప దేవాలయం సహా పలు ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తాం. 20 మందిని బృందాలుగా చేసి తెలంగాణలో పలు ప్రాంతాలను చూపే ప్రయత్నం చేస్తున్నాం.

పోచంపల్లి గ్రామ సందర్శన ద్వారా చేనేత వైభవాన్ని, నాగార్జున్ సాగర్‌లో బుద్ధవనం, చార్మినార్, లాడ్‌బజార్‌లలో హెరిటేజ్ వాక్, చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్, వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం, కాకతీయ హెరిటేజ్ టూర్ చూపించడం జరుగుతుంది. యాదగిరి గుట్టలో ఆధ్యాత్మిక టూర్‌తో పాటుగా మెడికల్ టూరిజంను కూడా ప్రమోట్ చేస్తున్నాం. 

 స్మితా సభర్వాల్, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి 

ఈ పోటీలు అవసరమా? 

తెలంగాణను పర్యాటకంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాయి కనుకనే ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే నినాదంతో కష్టపడి ఈ పోటీలను రాష్ట్రానికి తెచ్చాం అని టూరిజం శాఖ డప్పు కొట్టుకోవడం జరుగుతున్నది. దేశ విదేశీ పర్యాటకులను ఆహ్వానించడానికి, గొప్ప చేనేత వారసత్వం, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, అరుదైన వంటకాలు చేయడానికి ఈ అందాల పోటీలను ఎంచుకున్నాం అని చెప్పడం ఇంకా హాస్పాస్పదం.

మరే అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, ఈవెంట్లు, సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించినా ఈ ప్రయోజనాలు అన్నీ నెరవేరుతాయన్నది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏ గంగలో కలిశాయో కానీ, ఈ అందాల పోటీలను చూసి ఆనంద పడిపోవాలంటున్నారు. నిరుద్యోగ యువతకు, మహిళలకు ఉపాధి కల్పన, మహిళా భద్రత గురించి కనీస పథకాలు రూపొందించలేని ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. విద్యా, వైద్యం, గ్రామీణ, పట్టణ అభివృద్ధి లాంటి ఎన్నో కీలకమైన అంశాలను విస్మరించి అభివృద్ధి జపం చేస్తూ కాలయాపన చేసే కాంగ్రెస్ సర్కార్ ఈ అందాల పోటీలను మాత్రం తెలంగాణ ఘనతగా చెప్పుకోవడం దారుణం. 

 ఇ.హేమలత, ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్

77 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో..

72వ సారి మిస్ వరల్డ్ అందాల పోటీలకు మన హైదరాబాద్ నగరం వేదికైంది. ఈ పోటీల్లో మొత్తం 140 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నట్టు సమాచారం. ఈ పోటీలకు ప్రభుత్వం 54 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించింది. కేవలం అందాల పోటీలకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎంత వరకు కరెక్ట్.

ఇది రాష్ట్రానికి చాలా లాభదాయకమని రెవెన్యు జనరేటింగ్ ప్రాజెక్ట్ అని చెబుతున్నది. తెలంగాణ పర్యాటక రంగానికి గొప్ప అవకాశమని.. ఆహారం, అథిత్యం, పర్యాటకం, చేనేత వస్త్రాలు, పెట్టుబడులు వంటి రంగాల్లో అభివృద్ధికి ఇది అవకాశమని ఎన్నో కహనీలు చెబుతున్నది ప్రభుత్వం. విచిత్రమేమిటంటే.. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు గడిచినా గ్రామీణ స్థితిగతులు మారలేదు. విద్యలో ఇంకా వెనకబడి ఉన్నాం.

స్కూల్స్, కాలేజీలు, హాస్టళ్ళలో సరైన బాత్ రూమ్స్ లేవు. తాగడానికి మంచినీరు లేదు. కనీస మౌలిక అవసరాలు తీర్చలేని ప్రభుత్వం అందాల పోటీలు ఎవరికోసం నిర్వహిస్తుంది. సరైన వైద్యం అందక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ప్రభుత్వం అందాల పోటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నది. 

 శాంతి సాయిజెన్ శేఖర్, నాచారం కార్పొరేటర్

ఇది నా అదృష్టం

ఇండియాకు నా హృదయంలో ప్రత్యేక స్థానముంది. గత సంవత్సరం ఇక్కడే నేను మిస్ వరల్డ్ కిరీటం అందుకున్నా. తెలంగాణను అన్వేషించే అవకాశం నాకు కలగడం ఓ అదృష్టంగా భావిస్తున్నా. వైవిధ్యత అనేది ఇండియా బలమైనది. ఇక్కడ విభిన్న భాషలు, మతాలు ఉన్నాయి.

ఇది ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇదే మిస్ వరల్డ్ పోటీల్లోనూ కనిపిస్తుంది. యాదగిరిగుట్ట దేవాలయం సందర్శించా.. దేవాలయ నిర్మాణ శైలి అద్బుతం. ఆధ్యాత్మిక పరంగా గొప్ప అనుభూతులను పొందాను. ఈ సందర్భంగా చీర కట్టుకోవడం నాకు సంతోషాన్ని కలిగించింది. 

 యాదగిరి గుట్టను సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా