calender_icon.png 11 January, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిలియన్ మార్చ్ తరహాలో కులగణన మార్చ్

17-09-2024 05:35:35 AM

  1. 25న సుందరయ్య పార్క్ నుంచి ర్యాలీ 
  2. బీసీ గణన కాదు.. కులగణన చేయాలి 
  3. కాంగ్రెస్‌ను బొంద పెట్టేందుకు బీసీలు సిద్ధం 
  4. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 16(విజయక్రాంతి):  మిలియన్ మార్చ్ తరహాలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 25న కులగణన మార్చ్ నిర్వహించబో తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అందులో భాగంగా సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సోమవారం బీసీ సంక్షేమ సంఘం, బీసీ కులసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యం లో ముద్రించిన కులగణన మార్చ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కుల గణన చేపడుతామని కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌లో తెలిపిందన్నారు.

కులగణన చేయాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేస్తున్నారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని పక్కన పెడుతోందన్నారు. అధికారంలోకి వచ్చాక బీసీలను మోసం చేసి దొంగచాటున స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అయితే తాను వేసిన హైకోర్టులో పిటిషన్ వేయడంతో బీసీ కులగణన చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో వెనక్కి తగ్గింద న్నారు. ఆదివారం పీసీసీ అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో సీఎం రేవంత్‌రెడ్డి మరో మూడు నెలల్లో బీసీ కులగణన చేపట్టబోతున్నట్లు చెప్పారన్నారు.   తమకు కావలసింది కులగణన మాత్రమేనని స్పష్టం చేశారు.  కులగణన చేయకపోతే కాంగ్రెస్‌ను బొంద పెట్టేందుకు బీసీలు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. 

ఒక్క కులాన్ని అందలమెక్కించడమే సామాజిక న్యాయమా ?

ఒక్క కులాన్ని అందలమెక్కించడమే సామాజిక న్యాయమా అని జాజుల ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, ఆయ న సోదరులు, సామాజిక వర్గానికి చెందిన వారు సీఎం, మంత్రులు, పదవులు తీసుకోవచ్చు కానీ బీసీలు ఎంపీటీసీలు కాకూడదా అని ప్రశ్నించారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు ఓటేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.వాపు చూసి బలుపు అనుకుంటున్నారని, తుమ్మితే ఊడే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దే వా చేశారు. బీసీలపై స్పష్టమైన వైఖరి ప్రకటించని బీజేపీ, క్యాసీఆర్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షు డు తాటికొండ విక్రమ్‌గౌడ్, మహిళా సంఘం అధ్యక్షురాలు మణిమంజిరి,  నాయకులు కుందారం గణేశ్, వేముల వెంకటేశం, కుల్కచర్ల శ్రీను, పాల్గొన్నారు.