calender_icon.png 23 September, 2024 | 12:02 AM

ముగ్గురిపై హత్యాయత్నం కేసు

22-09-2024 02:13:26 AM

చార్మినార్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నూరీనగర్‌కు చెందిన ఖాతిజబేగం, ఫారుఖ్ భార్యభర్తలు. ఖాతిజబేగం గతంలో ఇస్మాయిల్‌నగర్‌కు చెందిన ఐజాజ్ అలియాస్ ఏజాజ్‌కి చెందిన ప్రైవేట్ కంపెనీలో పని చేసేది. కొన్నాళ్ల క్రితం ఖాతిజబేగం పని మానేసింది. అయినప్పటికీ ఏజాజ్ తరుచూ ఆమెకు ఫోన్ చేస్తూ వేధించేవాడు. ఐజాజ్ దీంతో ఫారుఖ్‌కు ఫోన్ చేసి ‘నీ భార్య నాతో మాట్లాడటం లేదు. ఇలానే చేస్తే మీ పిల్లలను చంపేస్తా’ అంటూ బెదిరించాడు.

ఐజాజ్‌ను చంపేస్తే అసలే సమస్య ఉండదని భార్యాభర్తలు భావించారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇస్మాయిల్‌నగర్‌లోని ఓ హోటల్ వద్ద ఐజాజ్ ఉండగా, అతడిని బలవంతంగా  ఆటోలో ఎక్కించుకొని లేక్‌వ్యూ హిల్స్‌లోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లారు. ఖాతిజబేగం, ఫారుఖ్‌తో పాటు వీరి కుమారుడు ఫైజన్ మూకుమ్మడిగా ఐజాజ్‌పై బండరాళ్లతో మోది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఐజాజ్ రక్తపు మడుగులో ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఐజాజ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కిడ్నాప్‌తో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శనివారం వారిని రిమాండ్‌కు తరలించారు.