25-04-2025 01:36:18 AM
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): అతితక్కువ కాలంలోనే తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న ‘విజయక్రాంతి’ దినపత్రికలో వస్తున్న కథనాలు, వార్తలను మక్కీకి..మక్కీ కాపీకొట్టి తన వెబ్‌సైట్‌లో, ఈ పేపర్‌లో ప్రచురించుకుంటున్న ‘వాయిస్‌టుడేన్యూస్ డాట్‌కామ్’ వెబ్‌సైట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
చీటింగ్‌తోపాటు, కాపీరైట్ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్‌కాంటినెంటల్ పబ్లికేషన్స్ ప్రై. లి. ఆధ్వర్యంలో గడిచిన కొద్దిసంవత్సరాలుగా ‘విజయక్రాంతి’ తెలుగు దినపత్రిక వెలువడుతున్న విషయం తెలిసిందే.
అనతికాలంలోనే ప్రజల గొంతుకగా మారిన విజయక్రాంతికి వస్తున్న ఆదరాభిమానాలను తమకు అనుకూలంగా మలు చుకోవాలని ‘వాయిస్‌టుడేన్యూస్ డాట్‌కామ్’ ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘వాయి స్‌టుడే’ ఈ పేపర్‌లో.. విజయక్రాంతి కథనాలు, వార్తలను మక్కీకి, మక్కీ కాపీకొడుతు న్నారు. దీనిని పరిశీలించిన విజయక్రాంతి దినపత్రిక యాజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గడిచిన కొద్దిరో జులుగా విజయక్రాంతి తెలుగు దినపత్రికలో మొదటిపేజీలో వస్తున్న ప్రముఖ కథనాలు, వార్తాంశాలను యథాతధంగా వాయిస్‌టుడే న్యూస్‌వెబ్‌సైట్ ఈపేపర్‌లో వాడుకుంటూ.. ప్రజలను మోసం చేస్తూ, కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిన వైనాన్ని పత్రిక యాజమా న్యం తరఫున సీఈవో రాహుల్ దేవళ్ల సైబర్‌క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును తీసుకున్న సైబర్‌క్రైమ్ పోలీసు లు కేసు నమోదు (ఎఫ్‌ఐఆర్ నెం. 768/ 2025) చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 318 (4), కాపీరైట్ చట్టంలోని 63, 65 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.