calender_icon.png 29 September, 2024 | 11:48 PM

సిద్ధరామయ్యపై కేసు నమోదు

28-09-2024 01:51:11 AM

  1. ముడా స్కాంలో ఏ-1 చేర్చిన లోకాయుక్త 
  2. తర్వాత భార్య పార్వతమ్మ, బావమరిది పేర్లు

బెంగళూరు, సెప్టెంబర్ 27: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రోజురోజుకూ కష్టాలు పెరుగుతున్నాయి. తాజాగా ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త కేసు నమోదు చేసింది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు లోకాయుక్త పోలీసులు వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌లో సిద్ధరామయ్యను ఏ-1 నిందితుడిగా పేర్కొనగా.. ఆయన భార్య పార్వతమ్మ, బావమరిది మల్లికార్జన స్వామి ఏ-2, ఏ-3గా చేర్చారు. పార్వతమ్మకు బహుమతిగా ఇచ్చేందుకు దేవరాజ్ అనే వ్యక్తి నుంచి భూమి కొనుగోలు చేయగా.. అతని పేరును కూడా జతచేశారు. 

కోర్టుల్లోనూ చుక్కెదురు

పార్వతమ్మ భూమిని స్వాధీనం చేసుకున్నందుకు గాను ముడా విలువైన భూములను పరిహారంగా కేటాయించింది. ఇందులో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ సహా విపక్షాలు ఫిర్యాదు చేయగా.. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ విచారణకు అనుమతించారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని క్యాబినెట్ తీర్మానించగా గవర్నర్ తోసిపుచ్చారు.

దీంతో ఆయన నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన సిద్ధరామయ్యకు అక్కడ చుక్కెదురైంది. విచారణ జరపాల్సిందేనని కోర్టు తేల్చిచెప్పింది. కాగా, ఓ ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక కోర్టు..

సిద్ధరామయ్యపై లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించిగా శుక్రవారం కేసు నమోదు చేశారు. పార్టీలోనూ సిద్ధరామయ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆయన పదవి చిక్కుల్లో పడిందనే వార్తలు వస్తున్నాయి.