calender_icon.png 30 September, 2024 | 8:59 AM

స్టీరింగ్ లేని కారు

29-09-2024 02:23:15 AM

సంగారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్ నేతల బెంగ

పార్టీ ఎమ్మెల్యేలు క్యాంప్ కార్యాలయాలకే పరిమితం

కీలక నేతలందూ ఎవరికి వారే యమునా తీరే..

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్తబ్దుగా గులాబీ దళం

రెండు పర్యాయాలు అధికార పగ్గాల చేపట్టి రాష్ట్రాన్ని పాలించిన గులాబీ పార్టీకి సంగారెడ్డి జిల్లాలో ఇక ముందు మనుగడ ఉంటుందా? బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీని ఇకనైనా పట్టించుకుంటారా? పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికైనా నేతలు మేల్కొంటారా? పార్టీకి జిల్లాలో గత వైభవాన్ని తిరిగి తెచ్చుకోగలుగుతారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఆ పార్టీ నేతల వద్ద సమాధానాలు లేవు. జిల్లాలో సరైనా  నిర్దేశకులు లేక గులాబీ దళం చిన్నబోతుంది.   

సంగారెడ్డి, సెప్టెంబర్ 2౮ (విజయక్రాంతి) : శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో  బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి పరాభవాన్ని చవి చూసి, ఆపై నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంగారెడ్డి, జహీరాబాద్ చింతా ప్రభాకర్, మాణిక్‌రావు సైతం పార్టీ గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

వీరు కేవలం క్యాంప్ కార్యాలయాలకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ లుకలుకలను అదునుగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పార్టీ బలోపేతానికి అడుగులు వేస్తున్నది. మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ది, సంక్షేమ పథకాలను అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు.

ఎంపీ సురేష్ షెట్కార్, నారా యణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సైతం కిందిస్థాయిలో పార్టీ కేడర్‌ను బలోపేతం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కార్యకర్తలకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో పయనమెటు?

సమీపంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతల పయనం అగమ్యగోచరంగా మారిందన్న అభిప్రాయ రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నది. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలుపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టి కసరత్తు చేస్తున్నది.

ఆ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే లు, నియోజ కవ ర్గానికే పరిమి తమై నిత్యం ప్రజలతో మమేకమవుతున్నా రు. జహీరాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన అనుచరులను రంగంలోకి దించుకుతున్నారు.

జిల్లాలో పెద్దగా బీజేపీ ప్రభావం లేకపోయిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ అని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో గులాబీ అధిష్ఠానం అప్రమత్తమైతే బాగుంటుందని పార్టీ కేడర్ భావిస్తున్నది. బీజేపీకి గ్రామ, బూత్ స్థాయిలో బలమైన నాయకులు లేకపోవడం పెద్ద మైనస్. బీఆర్‌ఎస్‌కు ఆ బాధ లేదు కాబట్టి.. పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో మంచి విజయావకాశాలు ఉన్నాయి.

జహీరాబాద్‌లో మూడు ముక్కలుగా కాంగ్రెస్..?

జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలుగా చీలింది. శాసన సభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ చంద్రశేఖర్, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి ఎవరికి వారు తమ వర్గాన్ని పోషించుకుంటున్నారు.  దీంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.

ఆ అవకాశాన్ని బీఆర్ స్ మంచి అదునుగా తీసుకుని పనిచేస్తే ఈ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో మంచి పట్టు సాధించేందుకు అవకాశా లు ఉన్నాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అనుచురులమని చెప్పుకుని ప్రజలను మోసం చేసిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. 

సదరు నేతలు కొందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు బయటకు వచ్చారు. ఇండ్లు ఇప్పించకపోగా.. తీసుకున్న డబ్బులు సైతం తిరిగి ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు.