విండో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న యువకులు
జనగామ, అక్టోబర్ 18(విజయక్రాంతి): కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న క్రమంలో బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్ తొక్కడంతో ఒక్కసారిగా ఆ వాహనం పక్కనే ఉన్న కుంటలోకి దూసుకెళ్లింది. అందులోంచి దూకి ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు.
పాలకుర్తి మండలం గూడూరుకు చెందిన గొరేమియా, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన ఆదాం ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన మీటింగ్ శుక్రవారం జనగామలో జరుగగా వారు హాజరయ్యారు.
అనంతరం గొరెమియా కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఆదాంతో కలిసి జనగామ బతుకమ్మ కుంట గ్రౌండ్‌కు వెళ్లారు. కుంట పక్కనే ఉన్న గ్రౌండ్‌లో గొరేమియాకు ఆదాయం డ్రైవింగ్ నేర్పిస్తు న్నాడు. ఈ క్రమంలో కుంటకు చేరువలో కారును మలిపే క్రమంలో బ్రేక్‌కు బదులు గట్టిగా యాక్సలేటర్ తొక్కడంతో ఒక్కసారిగా అతివేగంతో ఆ కారు కుంటలోకి దూసుకెళ్లింది.
కాసేపు నీళ్లపై తేలుతుండగానే అందులో ఉన్న ఇద్దరు యువకులు విండో గ్లాస్ ఓపెన్ చేసి అందులో నుంచి బయట దూకారు. ఆ తరువాత కారు మొత్తంగా నీటిలో మునిగిపోయింది. సీఐ దామోదర్‌రెడ్డి అక్కడికి చేరుకుని వాహనాన్ని బయటికి తీయించారు. ఘటనపై కేసు నమోదు చేశామని తెఇపారు. ఎవరూ బతుకమ్మ కుంటలో డ్రైవింగ్ కోసం రావద్దని ఆయన సూచించారు.