calender_icon.png 15 January, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్రేగుతున్న టెర్రర్

18-07-2024 01:18:48 AM

  • జమ్మూలో సైన్యంపై నిత్యం దాడులు 
  • ఏం జరుగుతోందో అర్థం కాక తలలు పట్టుకుంటున్న ఆర్మీ 
  • అంతా పాక్ వల్లే అంటున్న మేధావులు 
  • ముష్కరుల చేతుల్లో అధునాతన ఆయుధాలు 
  • పాక్ మాజీ సైనికులు సాయం చేస్తున్నట్లు అనుమానాలు? 

న్యూఢిల్లీ, జూలై 17: ఒకప్పుడు కశ్మీర్‌లో ఎక్కువగా ఉగ్రదాడులు జరిగేవి. కానీ కొద్ది రోజులుగా ఉగ్రవాదులు రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. కశ్మీర్ లోయలో కాకుండా వారు జమ్మూలో పంజా విసురుతున్నారు. వరుస దాడులు చేస్తూ మన సైనికుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఎప్పుడైతే కేంద్రం 370 ఆర్టికల్‌ను రద్దు చేసిందో అప్పటి నుంచి కశ్మీర్ లోయలో ఉగ్రవాదం తగ్గుతూ వచ్చిందని అనేక మంది నేతలు అనేక సందర్భాల్లో చెప్పారు. అదే నిజం చేస్తూ కశ్మీర్ లోయను వదిలి ఉగ్రవాదులు జమ్మూను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.

వరుస దాడులు చేస్తూ  అరాచకం సృష్టిస్తున్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా కానీ ఉగ్రదాడులు మాత్రం ఆగకపోవడం గమనార్హం. జమ్మూలో ఉగ్రవాదులు ఇలా  రెచ్చిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జమ్మూ రీజియన్‌లో ఉన్న రాజౌరి, పూంచ్ జిల్లాలను 2021 నుంచి ముష్కరులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. రియాసి, కథువా, ఉదంపూర్, దోడా జిల్లాల్లో కూడా ముష్కరులు పంజా విసురుతున్నారు. స్థానిక ప్రజలు కూడా ముష్కరులకు సాయం చేయడం వారికి కలిసొస్తోంది. 

పాక్ మాజీ సైనికులు పాల్గొంటున్నారా? 

జమ్మూ రీజియన్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులు కలవరం కలి గిసు న్నాయి. ఈ దాడుల్లో పాక్ మాజీ ఆర్మీ అధికారులు కూడా పాల్గొంటున్నారని నివే దికలు పేర్కొంటున్నాయి. దోడా జిల్లాలో జ రిగిన దాడిలో పాక్ మాజీ సైనికాధికారులు పాల్గొన్నారని అనుమానిస్తున్నారు. దాడి చేసిన తీరును చూస్తుంటే వారు తప్పకుండా మిలటరీ శిక్షణ తీసుకున్న వారే అని అర్థమవుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పాక్ ఎస్‌ఎస్‌జీ (స్పెషల్ సర్వీస్ గ్రూప్) హస్తం ఇందులో ఏమైనా ఉందా అనే కోణంలో ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. 

ముష్కరులకు సాయం అందుతోందా? 

ముష్కరులకు ఇతర దేశాల నుంచి సాయం అందుతోందనే అనుమానాలు కూ డా ఉన్నాయి. మొన్నటి దోడా ఎన్‌కౌంటర్ లో ముష్కరులు అధునాతన ఆయుధాలను వాడారు. అమెరికాలో తయారయ్యే ఎం4 కార్బైన్స్‌ను ఉపయోగించారు. వాటిని అఫ్ఘన్ యుద్ధంలో ఉపయోగించారు. ముష్కరులకు ఎవరో సాయం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దోడా ఘటనకు బాధ్యత వహి స్తూ కశ్మీర్ టైగర్స్ ప్రకటన విడుదల చేసింది. 

ఆపరేషన్ కొనసాగుతోంది.. 

సోమవారం దోడా ఘటన ఆర్మీని ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ముష్కరులను మట్టుబెట్టేందుకు ఆర్మీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో సైనికులు, పారా మిలటరీ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. 2021నుంచి జమ్మూ రీజియన్‌లో 52 మంది భద్రతా బలగాలతో కలిపి 70 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ శాతం భద్రతా బలగాలే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 

వాటితో మనకు ముప్పే.. 

అమెరికన్ ఆర్మీ పోతూ.. పోతూ అఫ్ఘనిస్తాన్‌లో వదిలి వెళ్లిపోయిన ఆయుధాలను ప్రస్తుతం కశ్మీర్ ముష్కరులు వాడుతున్నట్లు సమాచారం. ఈ అధునాతన ఆయుధాలతో సైనికులకు ఎప్పుటికైనా ముప్పే అని రెండున్నరేళ్ల కిందే అప్పటి బీఎస్‌ఎఫ్ డీజీ, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ సింగ్ హెచ్చరించారు. 2021 నుంచి ఇటువంటి ఆయుధాల స్వాధీనం పెరుగుతున్నట్లు బీఎస్‌ఎఫ్ డేటా సూచిస్తోంది. ఈ సంవత్సరం మే వరకే బీఎస్‌ఎఫ్ దళాలు 1500+ రౌండ్స్ ఏకే సిరీస్ మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కథువా దాడిలో టెర్రరిస్టులు అమెరికాలో తయారయిన ఎం4 కార్బన్ అసాల్ట్ రైఫిల్స్‌ను వాడినట్లు ఏజెన్సీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 

ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల హతం

అస్సాం పోలీసులు మంగళవారం ముగ్గురు అనుమానిత ఉగ్ర వాదులను మట్టుబెట్టారు. అస్సాం సరిహద్దు ప్రాంతం భుబన్ హిల్స్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు అనుమానిత ఉగ్రవా దులు చనిపోగా.. ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. దాదాపు గంట సేపు జరిగిన కాల్పుల్లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు అస్సాంలోని కచర్ ప్రాంతానికి చెందిన వారు కాగా.. మరొకరు మణిపూర్‌కి చెందిన వ్యక్తి.