calender_icon.png 22 December, 2024 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాటల తూటా.. సవాళ్ల మోత

22-12-2024 02:35:02 AM

* రసవత్తరంగా కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు

* ట్రెజరీ బెంచ్ నుంచి మూకుమ్మడి ఎదురుదాడి 

* ఓఆర్‌ఆర్ టెండర్‌పై సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశం 

* రోజుకో అంశంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన 

* ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొన్న సీఎం రేవంత్, మంత్రులు  

* రాష్ట్ర అప్పులపై లఘుచర్చ.. లెక్కలతో వివరించిన డిప్యూటీ సీఎం  

* ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలిపిన ఉభయ సభలు  

* 8 రోజులు.. 37.44 గంటలు సాగిన అసెంబ్లీ 

* శాసనసభ, శాసన మండలి నిరవధిక వాయిదా

హైదరాబాద్, డిసెంబర్  (విజయక్రాంతి) : వారంపాటు సాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తంగా సాగాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల తూటాలతోపాటు ఒకటి, రెండు అంశాలపై రాజీనామాలకు సిద్ధమా? అంటూ సవాళ్లు ప్రతిసవాళ్లతో కొనసాగాయి. గత అసెంబ్లీ సమావేశాల కంటే భిన్నంగా ఈ సెషన్‌లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎఎస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి,  మంత్రులు సమర్థంగా ఎదుర్కొన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగు తోంది. వివిధ సమస్యలపై అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వివిధ రకాలుగా నిరసన చెప్పేందుకు అసెంబ్లీకి రాగా.. ట్రెజరీ బెంచ్ నుంచి మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క , కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతోపాటు అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి దిగారు.

ప్రధానంగా ధరణి, హైడ్రా, ముసీ ప్రక్షాళన, రైత రుణమాఫీ, రైతు భరోసా, ఈ రేసింగ్ అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. సభ చివరి రోజున పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగానే స్పందించారు. ఇక ధరణి పోర్టల్ వల్ల వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికావడంతోపాటు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొం టున్నారని, అందుకే ధరణి పోర్టల్‌ను సవరిం చి భూభారతి చట్టాన్ని తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దీటుగా సమాధానమిచ్చారు.

ఔటర్ రింగ్‌రోడ్డు విషయంలో బీఆర్‌ఎస్ ఇరుకున పడిం దనే చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లకు ఇచ్చిన లీజ్‌లో అవినీతి జరిగిందని అధికార పార్టీ ఆరోపించగా.. అప్పటి టెండర్‌ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని హరీశ్‌రావు సూచనల మేరకు ఓఆర్‌ఆర్ టెండర్లపై సిట్ వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బీఆర్‌ఎస్ ఇరుకున పడిందని, ప్రభుత్వానికి ఒక అస్త్రాన్ని అందించినట్టుగా ఉందనే చర్చా నడుస్తోంది. రాష్ట్ర అప్పులు, ఆస్తులపైన కూడా సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. బీఆర్‌ఎస్ హయాంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క లెక్కలతో సహా వివరించి బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఈసారి సభలో అధికార పార్టీదే పైచేయి అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రోజుకో అంశంపై బీఆర్‌ఎస్ నిరసన 

సీఎం రేవంత్‌రెడ్డి, అధానితో ఉన్న టీ షర్ట్‌లు వేసుకుని కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడంతో వారిని సభలోకి రాకుండా మార్షల్స్ అడ్డుకుని బయటికి పంపించారు. లగచర్ల రైతుల అరెస్టుకు నిరసనగా బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలు చేతులకు బేడీలు వేసుకుని సభలోకి వచ్చారు. అయితే హరీశ్‌రావు, కేటీఆర్ బేడీలు వేసుకోకపోవడంతో.. బేడీలు వేసుకోవడంలోనూ దొరతనం ప్రదర్శించారని మంత్రులు సీతక్క, కొండా సురేఖ బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో పంటకు మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టారని, ఇసుక లారీలను అడ్డుకున్న సిరిసిల్ల రైతులను చిత్రహింసలు పెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీటుగా బదులిచ్చారు.

ఇక ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులు  ఆర్థికంగా నష్టపోతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ఆటో కార్మికులకు మద్దతుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆటోల్లో వచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం బీఆర్‌ఎస్ ఇష్టంలేదా? అని అధికార పార్టీ ఎదురుదాడి చేసింది. ఫార్ములా ఈ కారు రేసు అంశంపై కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు కావడంతో బీఆర్‌ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జిలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టగా, ఆర్బీఐ అనుమతి లేకుండానే రూ. 46 కోట్లు విదేశీ కంపనీలకు కేటీఆర్ చెల్లించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆధారాలతో వివరించే ప్రయత్నం చేశారు.  

 బిల్లులకు ఉభయ సభల ఆమోదం

శాసనసభా, మండలి నిరవధిక వాయిదా పడ్డాయి. డిసెంబర్ 9న ప్రారంభమైన శీతాకాల సమావేశాలకు సంబంధించి ఉభయసభలు ఈ నెల 21 వరకు కొనసాగాయి. మొత్తంగా ఏడు రోజులపాటు సమావేశాలు కొనసాగాయి. ఈ సెషన్‌లో శాసనసభ మొత్తం 37.44 గంటలపాటు సాగినట్టు మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. శాసన మండలి కూడా 7 రోజులపాటు నిర్వహించగా, 28.03 గంటలు చర్చలు జరిగాయని తెలిపారు. మొత్తం 71 మంది సభ్యులు మాట్లాడగా, 8 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకున్నట్టు చెప్పారు.

భూ భారతి  2024 చట్టం, పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ యంగ్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సవరణ బిల్లు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లు, తెలంగాణ పేమెంట్స్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. సభలో అధికార కాంగ్రెస్ పార్టీ 20.49 గంటల సమయం తీసుకోగా, అందులో సీఎం రేవంత్‌రెడ్డి 3.29 గంటలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మొత్తం 17.20 గంటల సమయం తీసుకున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీకి 5 గంటలు, బీజేపీకి 3.20 గంటలు, ఎంఐఎంకు 3 గంటలు, సీపీఐకి 1 గంట 50 నిమిషాల సమయం ఇచ్చినట్టు వివరించారు.