మహారాష్ట్రలో ఎన్డీయే ఏర్పాట్లు
ఎన్నికలెప్పుడు తెలియకున్నా.. జోరుగా పొత్తు రాజకీయాలు
కూటమి విచ్చిన్నం కాకుండా ఎత్తులు
సగం సీట్లకు పైగా పెద్దన్న బీజేపీకే
ముంబై, సెప్టెంబర్ 10: మహారాష్ట్రలో పొత్తు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో ఇప్పటికీ స్పష్టత లేనప్పటికీ అధికార ఎన్డీయే కూటమి ఎంతో జాగ్రత్తగా తన మిత్రులను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నది. మొన్నటివరకు పోతే పొండి అన్నట్టుగా ఉన్న బీజేపీ వైఖరి.. తాజాగా మీరే కావాలి అన్నట్టుగా మారిపోయింది.
సగం సీట్లు బీజేపీకే
ఇటీవల శివాజీ భారీ విగ్రహం కూలిపోవటంతో రాష్ట్రంలో తీవ్ర రాజకీయ రచ్చ చెలరేగింది. అది అధికార ఎన్డీయేను కూడా తాకింది. కూటమిలోని బీజేపీ, శివసేన, ఎన్సీపీ మధ్య బంధం బీటలు వారింది. ఆయా పార్టీల నేతలు బహిరంగంగానే పరస్పరం విమర్శలు గుప్పించుకొన్నారు. దీంతో ఇక కూటమి మనుగడ కష్టమేననే ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. బీజేపీయే ఎన్సీపీని, ఏక్‌నాథ్ షిండేను వదిలించుకొనేందుకు కుట్రలు చేస్తుందని కూడా పలువురు విమర్శలు గుప్పించారు. ఏం జరిగిందో ఏమో కానీ, తాజాగా కూటమి పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్టు కనిపిస్తున్నది.
మూడు ప్రధాన పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు మొదలుపెట్టాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లున్నాయి. మహాయుత్ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఒక్కటే 140 నుంచి 150 సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. అందుకు ఇతర పక్షాలు కూడా అంగీకరించినట్లు సమాచారం. సీఎం ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన 80, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 55 సీట్లలో పోటీచేసేందుకు ఒప్పుకొన్నట్టు తెలిసింది. మూడు స్థానాలను కూటమిలోని ఇతర చిన్న పార్టీల కోసం కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఓటమి భయంతోనే ఒక్కటిగా?
జూన్‌లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మొత్తం 48 స్థానాలకు గాను 30 చోట్ల గెలుపొంది విపక్ష కూటమి స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. దీంతో కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే), ఎన్సీపీ( శరద్‌పవార్) పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఇప్పుడు సమరోత్సాహంతో ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎంవీఏదే అధికారమని పలు సర్వేలు కూడా తేల్చాయి. దీంతో బీజేపీ జాగ్రత్త పడింది. చేతిలో ఉన్న మిత్రులను పోగొట్టుకొంటే దారుణ ఓటమి తప్పదన్న నిర్ణయానికి వచ్చిన ఆ పార్టీ షిండే, అజిత్ పవార్ మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నది. కూటమి విచ్చిన్నమైతే అందరికీ నష్టమేనని మిత్రులకు చెప్పి ఒప్పించటంలో సఫలమైనట్టు సమాచారం.
ఎన్నికలెప్పుడు?
మహారాష్ట్రలో కూడా అసెంబ్లీ ఎన్నికలు హర్యానా, జమ్ముకశ్మీర్‌తోపాటే జరుగాల్సి ఉన్నది. కానీ, ఎన్నికల రోల్స్ సిద్ధం కాలేదన్న కారణం చూపి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేసింది. ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో కూడా చెప్పలేదు. లోక్‌సభ ఎన్నికలు ముగిసి మూడు నెలలే కావటం, ఆ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు రావటంతో ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా అవే ఫలితాలు వస్తాయన్న భయంతోనే ఈసీపై ఒత్తిడి తెచ్చి ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. బహుషా దీపావళి తర్వాత ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉండవచ్చని అంటున్నారు.