కామారెడ్డి జిల్లా దోమకొండలో విషాదచాయలు...
కామారెడ్డి (విజయక్రాంతి): 10వ తరగతి తన తోటి చదువుకున్న పూర్వ విద్యార్థులతో జరిగిన సమ్మెళనంలో పాల్గొని వెళ్లిన బిటెక్ పైనల్ ఇయర్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన హైదారాబాద్‌లో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన ఐరెని నర్సయ్య కూతురు శ్రావణి(21) హైదారాబాద్‌లో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లోని నవోదయ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మెళనం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి తిరిగి వెళ్తుండగా హైదారాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేగంగా వెళ్తున్న కారు రాయదుర్గం నుండి గచ్చిబౌలి వైపు వెళ్తున్న బైక్‌ను వెనుకనుంచి డీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న శ్రావణి అక్కడికక్కడే మృతిచెందగా ర్యాపిడో బైక్ నడుపుతున్న సీనియర్ విద్యార్థి వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికంగా ఉన్న ప్రవేట్ ఆసుపత్రిలో వెంకట్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. శ్రావణి మృతి చెందడంతో దోమకొండలో విషాదచాయలు అలుముకున్నాయి. పద్మశాలి సంఘం మాజీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన ఐరెని నర్సయ్య దోమకొండ సర్పంచ్‌గా గాయిత్రీ షుగర్స్ సీడీసీ చైర్మన్‌గా పని చేశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె అమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా చిన్నకుమార్తె శ్రావణి బిటెక్ ఫైనల్ ఇయర్ హైదారాబాద్‌లో చదువుతుంది. ఆదివారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లోని నవోదయ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో పాల్గోని తిరిగి హైదారాబాద్‌లో రూమ్‌కు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎంతో భవిష్యత్ ఉన్న శ్రావణి మృతి చెందడంతో దోమకొండలో విషాదచాయలు అలుముకున్నాయి. శ్రావణి శవాన్ని గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి శవాన్ని దోమకొండకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. శ్రావణి తల్లితండ్రుల రోదనలు గ్రామస్తులను కలిచివేసింది.