calender_icon.png 4 March, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూవివాదంలో ఘర్షణ.. గొడ్డలితో దాడి

03-03-2025 10:43:45 PM

నలుగురికి గాయాలు...

అశ్వరావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రత్యర్థులు గొడ్డళ్లు, కత్తులతో దాడికి దిగడంతో.. మహిళతో సహా నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన ఘటన సోమవారం మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దమ్మపేట మండలం చిన్న గోళ్లగూడెం గ్రామంలో గత ఏడు నెలల నుంచి ఓకే ఇంటి పేరుతో గల కుటుంబాల మధ్య ఆరు ఎకరాలకు చెందిన భూమి తగాదాలు జరుగుతున్నాయి.

ఈ విషయంలో గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. అయినా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఈ గొడవ కొనసాగుతూ వస్తోంది. సోమవారం ముస్టిబండ గ్రామానికి చెందిన కౌలూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులను తీసుకొని గొడవలో ఉన్న పొలంలో పెన్సింగ్ పీకుతుండగా కౌలురి ముత్తారావు కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని వెళ్లి అడ్డుకున్నారు. ఈ విషయంలో ఇరువురి మధ్య పెద్ద గొడవ జరిగింది. మాటమాట పెరిగి భౌతిక దాడులకు దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయినవారు ఒకరిపై ఒకరు గొడ్డళ్లు, కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నారు.

సుమారు 10 మంది గొడవలో ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఈ ఘర్షణలో కవులూరి వెంకటేశ్వరరావు, కవులూరి ఎంకమ్మ, కవులూరి సంజీవరావు కౌలూరి ఏసుబాబు ఈ నలుగురికీ, కాళ్ళు, చేతులు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ధమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం హాస్పిటల్ కి తరలించారు. ఈ గొడవలో వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి దాడులకు పాల్పడినట్లు ఒక వర్గం వారు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గొడవలో ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.