calender_icon.png 9 October, 2024 | 2:53 PM

పేదింట మెరిసిన విద్యాకుసుమం

09-10-2024 12:09:17 AM

ప్రభుత్వ టీచర్‌గా భవన నిర్మాణ కార్మికుడు

జనగామ, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జనగామాకు చెందిన ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించి సూఫర్తిగా నిలిచాడు. జనగామ పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన బండ ఐలయ్య, అండాలు దంపతుల రెండో కుమారుడు కృష్ణ డీఎస్సీ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ కొలువుకు ఎంపికయ్యాడు. తండ్రి ఐలయ్య హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని వెళ్లదీశాడు.

రెండో కుమారుడు బండ కృష్ణ జనగామలోని ఏబీవీ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా టైల్స్ కార్మికుడిగా పనిచేస్తూ వస్తున్నాడు. దాదాపు పదేళ్లుగా అదే వృత్తిలో కొనసాగుతున్న కృష్ణ చదువును ఎక్కడా ఆపలేదు. టైల్స్ కార్మికుడిగా పనిచేస్తూనే ఓయూలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశాడు. ఆ తర్వాత జనగామలోని ఏకశిల కాలేజీలో బీఈడీ చదివాడు. ఓ వైపు పని, మరో వైపు చదువును కొనసాగించి డీఎస్సీ ఫలితాల్లో సాంఘిక శాస్త్రం విభాగంలో ఆరో ర్యాంకు సాధించి స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందాడు.